నేటి అర్ధరాత్రి నుంచి శ్రీవారి దర్శన టోకెన్ల నిలిపివేత

Published: Thursday August 09, 2018

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శన టోకెన్ల జారీని గురువారం అర్ధరాత్రి నుంచే తితిదే నిలిపివేయనుంది. అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం నేపథ్యంలో భక్తుల క్రమబద్ధీకరణను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టింది. అర్ధరాత్రి నుంచి తిరుమలకు కాలినడకన వచ్చే వారికి దివ్యదర్శనం టోకెన్లు, సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్ల జారీని పూర్తి స్థాయిలో నిలిపివేయనుంది. మహాసంప్రోక్షణ నేపథ్యంలో ఈ నెల 11 నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులను క్రమబద్ధీకరించేందుకు ఈ చర్యలు చేపట్టనుంది. 11న సంప్రోక్షణకు అంకురార్పణ జరుగుతుంది. ఆ రోజున 9 గంటల పాటు మాత్రమే స్వామివారి దర్శనానికి సమయం ఉంటుంది. అంకురార్పణ రోజున 50 వేల మందికి మాత్రమే స్వామి దర్శనం కలగనుంది. ఈ నెల 12 నుంచి పూర్తి స్థాయిలో క్రమబద్ధీరించి.. పరిమిత సంఖ్యలో భక్తులను ఆలయానికి అనుమతించనున్నారు. రోజుకు 18 వేల నుంచి 35 వేల మందికి మాత్రమే అవకాశం ఉంటుందని తితిదే ఇప్పటికే ప్రకటించింది. శ్రీవారి ఆలయంలో యాగగుండాలు, వేద పారాయణం వేదికలు, క్యూలైన్ల నిర్మాణానికి సామగ్రిని తరలించే పనులు బుధవారం సాయంత్రం నుంచి జోరుగా మొదలయ్యాయి