వైభవంగా మహాశాంతి తిరుమంజనం

Published: Thursday August 16, 2018
తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న అష్టబంధన బాలాలయ మహోసంప్రోక్షణలో నాలుగో రోజున బుధవారం చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం, మహాశాంతి తిరుమంజనం కార్యక్రమాలను ఆగమ శాస్త్రబద్ధంగా నిర్వహించారు. వేకువజామున 2 గంటల నుంచి 4.30 గంటల మధ్య శ్రీవారి సన్నిధిలో సుప్రభాతం, యాగశాల శుద్ధి, తోమాల, కొలువు, పంచాంగ పఠనం, అర్చన, సహస్రనామ పారాయణం, నివేదన సమర్పించారు. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల మధ్య ఆనంద నిలయంలోని మూలవర్లకు, పరివార దేవతామూర్తులకు క్షీరాభిషేకం, చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించారు.
 
 
క్షీరాధివాస తిరుమంజనం
విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ సమయంలో విశ్వంలోని శక్తిని ఆవాహన చేసేందుకు అధివాసం నిర్వహిస్తారు. 14 కలశాలతో ప్రత్యేకంగా మూలమూర్తికి, ఇతర పరివార దేవతామూర్తులకు క్షీరాధివాస తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇదే సమయంలో యాగశాలలో ఉత్సవమూర్తులకు, పరివార దేవతామూర్తులను పవిత్రజలాలతో అభిషేకించారు.
 
 
గోపుర శిఖరాల ప్రతిబింబాలకు అభిషేకం
శ్రీవారి ఆలయ గోపుర కలశాలను అద్దంలో చూపి వాటి ప్రతిబింబాలకు అభిషేకం నిర్వహించారు. విమాన వేంకటేశ్వరస్వామి, ఇతర పరివారదేవతామూర్తుల గోపుర కలశాలకు పవిత్ర జలం, పాలతో అభిషేకం చేశారు. కాగా, మూలవిరాట్టుతో పాటు ఉపాలయాల్లోని దేవతలకు మంగళవారం అష్టబంధన కార్యక్రమం నిర్వహించారు. దేవతామూర్తుల పాద, పద్మపీఠాలకు సంధిబంధనం చేసిన అష్టబంధన ద్రవ్యం గట్టిపడడం కోసం అభిషేక జలాలతో మహాశాంతి తిరుమంజనం నిర్వహించారు. దీంతో అష్టబంధనం గట్టిపడి పుష్కరకాలం పాటు దృఢంగా ఉంటుందని అర్చకులు తెలిపారు.
 
మహాసంప్రోక్షణ వైదిక క్రతువులో చివరి ఘట్టం పూర్ణాహుతి గురువారం జరగనుంది.
 
కుంభం నుంచి కళను, శక్తిని మూలవర్ల విగ్రహానికి, ఆనంద నిలయంపై ఉన్న ప్రధాన కలశానికి సంప్రోక్షణ చేయడంతో మూలవిరాట్టుకు పూర్వశక్తులను అందించినట్లవుతుంది. సాయంత్రం గరుడసేవ, పెద్దశేష వాహనాలపై స్వామి తిరువీధి ప్రదక్షిణ చేస్తారు. రాత్రి యాగశాలలో చివరగా హోమాలు జరిపించి, అర్చకులకు, రుత్వికులకు బహుమానాలు సమర్పించడంతో మహాసంప్రోక్షణ పరిసమాప్తమవుతుంది. గురువారం 28 వేల మంది భక్తులకు దర్శనం కల్పించనున్నారు.