రద్దయిన పెద్దనోట్ల లెక్క ఇప్పటికి తేలిందట

Published: Thursday August 30, 2018

దేశ ప్రజలకు షాకిస్తూ ప్రధాని మోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు వ్యవహారంలో మోడీ వైఫల్యం గురించి ఇప్పటికే తెలుసు. పెద్దనోట్ల రద్దుతో అవినీతి.. అక్రమాలకు చెందిన నోట్ల లెక్క తేలటంతో పాటు.. కరెన్సీలో కలిసిపోయిన దొంగ నోట్ల చెలామణీ భారీగా తగ్గుతుందన్న లెక్కలు అప్పట్లో వినిపించాయి.దేశ ప్రజల వద్దనున్న పెద్దనోట్లలో.. ఎంతమేర బ్యాంకులకు చేరాయి? ప్రభుత్వం అంచనా వేసినట్లుగా అవినీతి అక్రమార్కుల వద్దనున్న బ్లాక్ మనీని బ్యాంకుల వద్దకు రాకుండా అడ్డుకోగలిగారా? అన్న లెక్కలు తాజాగా తేలాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కొండను తవ్వి ఎలుకను బయటకు తీసిన చందంగా.. రద్దైన పెద్దనోట్లలో తిరిగి వచ్చిన నోట్లు 99.3 శాతం కావటం గమనార్హం.

తాజాగా విడుదల చేసిన నివేదికలో రద్దైన పెద్దనోట్లు ఎన్ని నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయన్న లెక్కను తేల్చారు. దీని ప్రకారం 2016 నవంబరు 8 ముందు వరకురూ.15.41 లక్షల కోట్ల రూ.500..రూ.వెయ్యి నోట్లు చెలామణీలో ఉన్నాయి. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో రూ.15.31 లక్షల కోట్ల నోట్లు బ్యాంకుల ద్వారా చేరినట్లుగా ఆర్ బీఐ తెలిపింది.

రద్దు అయిన పెద్దనోట్ల లెక్కను విజయవంతంగా పూర్తి అయినట్లుగా ఆర్ బీఐ పేర్కొంది. వీటి లెక్కింపు కోసం ప్రత్యేక యంత్రాలను ఉపయోగించినట్లుగా పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కారణంగా ప్రజలు పడ్డ కష్టాలు..ఇబ్బందులు ఒక ఎత్తు.. పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లను తీసుకురావటానికి పెట్టిన ఖర్చు.. రద్దు అయిన పెద్దనోట్లను లెక్క పెట్టటానికి.. వాటిని సేకరించటానికి ఖర్చు అయిన పని గంటలు.. ఇతర ఖర్చుల్ని లెక్కిస్తే.. పెద్దనోట్ల రద్దు ఎంత నష్టంతో కూడిన వ్యవహారమో ఇట్టే తెలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.