‘తితలీ’ తుపానుపై రాత్రంతా చంద్రబాబు నాయుడు కంటిమీద కునుకు లేకుండా గడిపారు

Published: Thursday October 11, 2018
అమరావతి: ‘తితలీ’ తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటిమీద కునుకు లేకుండా గడిపారు. తుపానుపై రాత్రంతా అప్రమత్తంగా ఉన్న సీఎం ప్రతి రెండు గంటలకు ఒకసారి సమీక్ష నిర్వహించారు. ఆర్టీజి, ఇస్రో అధికారుల నుంచి తుపాన్ కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించారు. ఆర్టీజి ద్వారా శ్రీకాకుళం అధికారులకు తుపాన్ సమాచారం అందజేశారు. తెల్లవారుజామున వాయుగుండం తీరాన్ని దాటినట్లు సమాచారం అందడంతో దాని ప్రభావంపై అధికారులతో సమావేశం నిర్వహించారు.
 
తుఫాను ప్రభవాతంతో పలాస మున్సిపాలిటీలో తీవ్ర నష్టం వాటిల్లిందని, ఈదురుగాలుల వల్ల భారీగా పంట నష్టం, ఆస్తినష్టం కలిగినట్లు తెలిపారు. పంటనష్టం, ఆస్తి నష్టంపై సమాచారం సేకరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. వర్షాలు తెరిపి ఇచ్చిన వెంటనే సహాయ పునరావాస చర్యలు చేపట్టాలన్నారు. పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. భోజనం, పులిహోర, తాగునీటి పాకెట్లు పంపిణీ చేయాలని, సహాయ పునరావాస చర్యల్లో అందరూ పాల్గొనాలని సీఎం సూచిచంారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు సహాయచర్యలలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సాయంత్రానికల్లా సాధారణ పరిస్థితులు వచ్చేలా చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.