టెన్త్‌ విద్యార్థికి.... చంద్రబాబు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి 8లక్షలు

Published: Tuesday November 20, 2018
పి.గన్నవరం మండలం మానేపల్లి గ్రామానికి చెందిన మద్దుల రాజేశ్వరి కుమారుడు గిరీష్‌ (14) కొంత కాలంగా లుకేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. దీనికితోడు ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగా ఉండటంతో ముఖ్యమంత్రి సహాయం కోసం తమ బాధలను విన్నవించుకున్నారు. దీనికి స్పందించిన చంద్రబాబు రూ.8లక్షలను మంజూరు చేస్తూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మానేపల్లి గ్రామానికి చెందిన గిరీష్‌ పదో తరగతి చదువుతున్నాడు. నెల క్రితం జ్వరం కాస్తా డెంగీ జ్వరంగా మారి తీవ్రత ఎక్కువైంది. దీంతో గిరీష్‌ను కామినేని ఆసుపత్రికి తరలించారు.
 
 
వైద్యులు చికిత్స అందిస్తున్నప్పటికి వ్యాధి తీవ్రత తగ్గకపోవటంతో హైదరాబాద్‌లోని రైన్‌బో ఆసుపత్రిలో డాక్టర్‌ శిరీష్‌ వద్ద చికిత్స చేయిస్తున్నారు. అక్కడి వైద్యులు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి లుకేమియా వ్యాధిగా నిర్ధారణ చేశారు. దీని నివారణకు లక్షల్లో ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పటంతో గిరీష్‌ తల్లి రాజేశ్వరి సోమవారం ఉండవల్లి ప్రజాదర్బార్‌లో సీఎం చంద్రబాబును కలిసి వేడుకుంది. సోషల్‌ మీడియాలో టీడీపీ కార్యకర్తలను ఆశ్రయించడంతోపాటు ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, హోంమంత్రి చినరాజప్ప సిఫార్సు పత్రాలతో ముఖ్యమంత్రి సహాయ నిధిని ఆశ్రయించింది.
 
 
వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి 8లక్షలు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీచేశారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో వైద్య పరంగా ఇబ్బందులు ఎదురైతే ఆర్ధికంగా భరోసా ఇచ్చారని ఆమె తెలిపారు. తమకు సహకరించిన హోంమంత్రి చినరాజప్ప, ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, సోషల్‌ మీడియా సీబీఎన్‌ ఆర్మీ సభ్యుడు మానం బ్రహ్మయ్య, ముఖ్యమంత్రి సహాయ కార్యదర్శి రామసుబ్బయ్యలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.