టీడీపీ అలా మాట్లాడడం దురదృష్టకరం

Published: Tuesday September 17, 2019
‘‘మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ మరణం భాధాకరం. ఆయన మృతిపై మీడియాలో భిన్న కథనాలు వస్తున్నాయి. ఆయన మరణంపై మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. రాజకీయ నాయకుడు మరణించినప్పుడు సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. సాక్ష్యాలు తారుమారు కాకుండా తెలంగాణ ప్రభుత్వం విచారణ జరపాలి. గుండెపోటు అయితే ఎవరైనా అపోలో, కేర్‌ ఆస్పత్రులకు తీసుకెళ్తారు. ఎవరైనా బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రికి తీసుకెళ్తారా?’’ అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఒత్తిడి వ ల్లే ఉరి వేసుకున్నారని టీడీపీ నాయకులు చెప్ప డం వారి నీచ రాజకీయానికి నిదర్శనమన్నారు. ఉరి వేసుకున్నారా? కుటుంబ కలహాలతో ప్రమాదం జరిగిందా? లేదా మరేదైనా కారణం ఉందా?... అన్ని కోణాల్లో తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టాలని కోరుతున్నామన్నారు. పోస్టుమార్టం నివేదికలో కోడెల మృతికి కారణాలు తెలుస్తాయన్నా రు. కోడెల శివప్రసాద్‌పై ప్రభుత్వం కేసులు పెట్టలేదని, ఆయన వల్ల బాధపడిన వారే కేసులు పెట్టారని పేర్కొన్నారు. తమకు శవ రాజకీయాలు చేయడం తెలియదన్నారు.
 
‘‘కోడెల మరణం తీవ్ర దిగ్ర్భాంతి కలిగించింది. వారి కుటుం బ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. కోడెల మృతికి వైసీపీ సంతాపం వ్యక్తం చేస్తుందన్నారు. ఆయన మరణాన్ని ఎవ్వరూ రాజకీయ కోణం లో చూడాల్సిన పని లేదన్నారు. ప్రతిదీ రాజకీయానికి వాడుకోవడం టీడీపీ నైజమన్నారు. సీనియర్‌ నేత చనిపోయాడనే బాధ కూడా లేకుండా టీడీపీ నేతలు వైసీపీపై బురదజల్లుతున్నారన్నారు. కోడెల మృతికి నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంతాపాన్ని వ్యక్తం చేశారు. కోడెల ఆకస్మిక మరణానికి చింతిస్తున్నట్టు ప్రకటించారు.