మనిషి బరువు పెరుగుదలకు ఆవేశమే కారణం

Published: Saturday June 02, 2018

ఒక వ్యక్తి బరువు పెరగడానికి అతనికి ఉన్న ఆవేశమే ప్రధాన కారణమని అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆన్ ఏజింగ్ అనే సంస్థ నిర్వహించిన తాజా అధ్యయంలో వెల్లడైంది. ముఖ్యంగా రోజువారీ జీవితంలో అత్యంత జాగరూకతతో, సహనంతో ఉండేవారి బరువులో పెద్ద మార్పులేవీ కనిపించలేదని ఈ సంస్థకు చెందిన పరిశోధకులు వెల్లడించారు. 

వ్యక్తిత్వ విలక్షణతకు అధిక బరువుకు మధ్య గల సంబంధాన్ని తెలుసుకోవడానికి ఈ పరిశోధకులు మొత్తం 1,988 మందిని ఎంపిక చేసి వారి జీవన విధానం, బరువు, ఆహారపు అలవాట్లపై 50 యేళ్ళ పాటు అధ్యయనం చేశారు. 

ఈ అధ్యయనంలో వ్యక్తుల వయస్సు పెరుగుతున్న కొద్దీ బరువు కూడా పెరగడానికి వారిలో ఉండే ఆవేశమే కారణమని తేల్చారు. వ్యక్తి వయస్సుతో పాటు బరువు పెరగకుండా ఉండాలంటే ఆవేశం తగ్గించుకుని, సమతుల్య ఆహారం తీసుకుంటూ రోజులో కొంత సేపు శారీరక శ్రమ చేయాల్సి ఉంటుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ ఏంజిలినా సూచించారు. 

అయితే, అవేశపరులు పనులు చేయాడానికి ఇష్టపడరని, కానీ, తినడానికి, విందు భోజనాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతారని పేర్కొంది. నెమ్మదస్తులు ఒక రోజు ఆహారం ఎక్కువగా తీసుకున్నా తర్వాత రోజు తక్కువగా తీసుకుంటారని, ఆహరం తీసుకోవడంలో నియంత్రణ పాటిస్తారని ఏంజిలినా తెలిపారు.