కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ ప్రకటన

Published: Tuesday December 04, 2018
వచ్చే ఏడాది ఎన్నికల్లో పోటీ చేయనని మాజీ మంత్రి, కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ ప్రకటించారు. సోమవారం తన 72వ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్తూ ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇకపై అందరికీ శ్రీనుబాబుగానే అందుబాటులో ఉంటానని విలేకరులకు తెలిపారు. బీజేపీని వీడేది లేదని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన కామినేని శ్రీనివాస్‌ 2014లో.. నాటి బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడి ఆశీస్సులతో కైకలూరు బీజేపీ టికెట్‌ సాధించి.. టీడీపీ పొత్తుతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నవ్యాంధ్రలో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో నాలుగేళ్లపాటు వైద్య, ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన నరేంద్ర మోదీ ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని నాలుగేళ్లయినా ఇవ్వక పోవడంతో కేంద్రం నుంచి టీడీపీ మంత్రులు బయటకు వచ్చేశారు.
 
వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి బీజేపీకి చెందిన కామినేని శ్రీనివాస్‌, పైడికొండల మాణిక్యాలరావు కూడా వైదొలిగారు. బీజేపీలో తనకు రాజకీయ అండదండలు అందించే వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అవడం, ఆ తర్వాత రాష్ట్ర పార్టీ నాయకత్వ మార్పులతో కామినేని క్రియాశీల పాత్రను తనకు తానే తగ్గించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి పూర్తి అధ్వానంగా ఉండడంతో ఎన్నికల్లో పోటీ చేసినా గెలవడం అసాధ్యమన్న భావనతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. అయితే ఆయన మాత్రం ఈ విషయాలేవీ విలేకరుల వద్ద ప్రస్తావించలేదు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో ఉన్న సన్నిహిత సంబంధాలతో బీజేపీలోకి వచ్చానని, అలాగే ప్రజలు తనను నమ్మి ఓట్లువేసి గెలిపించారని.. నీతినిజాయితీతో స్నేహభావంతో ఇప్పటివరకు పనిచేశానని చెప్పారు. రాజకీయాల్లో ఉంటానని, ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం పోటీ చేయనని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తిమేర కృషి చేసినట్లు వివరించారు.