టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, జనసేనలది మోసం
Published: Sunday December 09, 2018

‘‘జగన్ ఒక్కడితోనే చెడిపోయిన రాజకీయ వ్యవస్థ బాగుపడిపోదు. ప్రజలందరి సహకారం, ఆశీస్సులతోనే అది సాధ్యమవుతుంది’’ అని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. ‘ప్రజాసంకల్ప యాత్ర’ శనివారం శ్రీకాకుళం చేరుకుంది. జీటీ రోడ్డు వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇతర పార్టీలను తూర్పారబట్టారు. అగ్రిగోల్డ్ బాధితులను, తితలీ బాధితలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ‘శ్రీకాకుళం జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులు 2.8లక్షల మంది ఉన్నారు. వీరికి న్యాయం చేయకుండా అగ్రిగోల్డ్ ఆస్తులను ఏవిధంగా కొట్టేద్దామన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. బినామీ పేరిట అగ్రిగోల్డ్, కేశవరెడ్డి ఆస్తులను సీఎం కాజేస్తుంటే... వాటిని మినహాయించి విచారణ నిర్వహించేందుకు సీఐడీ ఉంది. తితలీ తుఫాను అనంతరం 4రోజులు గడిచాక కూడా బాధితులకు పులిహోరా ప్యాకెట్లను పంపిణీ చేయలేకపోయారు. 10 రోజుల వరకు మంచినీరు అందించలేదు. శవాలపై చిల్లర ఏరుకునేలా సీఎం శైలి ఉంది’ అని అన్నారు.
‘రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తోంది. పాఠశాలలు అధ్వానంగా ఉన్నాయని ప్రజలతోనే అనిపిస్తూ వాటిని మూసివేసే ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలను బినామీలుగా మార్చేసి.. వేల రూపాయాలను ఫీజుల రూపంలో కాజేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి పూర్తిగా తూట్లు పొడిచారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల పోస్టులను భర్తీచేయకుండా ప్రైవేట్ యూనివర్సిటీలకు అవకాశం కల్పిస్తున్నారు’ అని విమర్శించారు.
‘రాష్ట్రంలో మాఫియా రాజ్యమేలుతోంది. రేషన్ కార్డు కావాలన్నా, ఫించన్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా లంచాలు ముట్టచెప్పాల్సిందే. ప్రజలనుంచి తహశీల్దార్ నుంచి కలెక్టర్, ఎమ్మెల్యే, మంత్రి, చినబాబు, పెదబాబు అందరూ లంచాల రూపంలో కాజేస్తున్నారు’ అని ఆరోపించారు.

Share this on your social network: