అర్హులందరికీ తప్పనిసరిగా ఓటు

Published: Tuesday December 11, 2018

రాష్ట్రంలో ఓట్లు గల్లంతయ్యాయంటూ రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్పీ సిసోడియా అన్నారు. తెలంగాణలో మాదిరిగా ఏపీలో ఓట్లు గల్లంతయ్యే అవకాశమేలేదని, ఇందుకోసం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో లోపాలను గుర్తించేందుకు విస్తృత కసరత్తు ప్రారంభించామని చెప్పారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో లోపాలను గుర్తించేందుకు ప్రత్యేకంగా నియమించిన 40 మందికి, ఎన్నికల సిబ్బందికి సోమవారం అమరావతి సచివాలయంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో సిసోడియా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ప్రత్యేకంగా నియమించిన సిబ్బంది నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాల్లో లోపాలను గుర్తించేందుకు వారంపాటు పని చేస్తారన్నారు. ఇప్పటికే à°ˆ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. బూత్‌లెవల్‌ ఆఫీసర్లు, పార్టీలు నియమించిన బూత్‌ లెవల్‌ ఏజెంట్లతో కూడా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. 2016-17లో తొలగించిన ఓట్ల జాబితాలను కూడా మరోమారు పరిశీలించి, తొలగించిన వాటిలో నిజమైన ఓటర్లు ఉంటే వారి పేర్లు జాబితాలో చేరుస్తామని సిసోడియా చెప్పారు. ఓటు తొలగింపు, చేర్చే అధికారం డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి ఈఆర్వోలకు మాత్రమే ఉంటుందని, ఈఆర్వోనెట్‌ నుంచి ఓట్లు తొలగించడం సులభం కాదన్నారు. ఎవరైనా తమ పేర్లు జాబితాలో లేవని గుర్తిస్తే వెంటనే ఫామ్‌-6లో నమోదు చేసుకోవచ్చన్నారు.