ఎన్టీఆర్ కుటుంబానికి ఓటమి
Published: Wednesday December 12, 2018

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ రామారావు కుటుంబానికి నాలుగో ఓటమి ఎదురైంది. ఆయన మనుమరాలు సుహాసిని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. అంతకు ముందు మూడుసార్లు ఆ కుటుంబానికి ఓటమి ఎదురైంది. ఎన్టీ రామారావు స్వయంగా ఒకసారి ఓడిపోయారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రెండు స్థానాల్లో పోటీ చేశారు. అందులో అనంతపురం జిల్లా హిందూపురంలో గెలిచి మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ స్థానంలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆయన పార్టీ కూడా ఓడిపోయింది. ఆ తర్వాత 1996 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన కుమారుడు జయకృష్ణ శ్రీకాకుళం నుంచి ఎంపీగా పోటీ చేశారు. అప్పటికి ఎన్టీఆర్ చనిపోయారు. ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి అధ్యక్షురాలిగా ఉన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. తర్వాత మళ్లీ జయకృష్ణ ఎన్నికల రాజకీయాల్లోకి రాలేదు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీ తరఫున గుడివాడ నుంచి పోటీచేశారు. టీడీపీతో విభేదించి ఆయన అన్న తెలుగుదేశం పార్టీ పెట్టారు. కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. తర్వాత ఆయన ఆ పార్టీని రద్దు చేసి మళ్ళీ టీడీపీలో చేరిపోయారు. ఇప్పుడు హరికృష్ణ కుమార్తె సుహాసిని కూకట్‌పల్లిలో పోటీ చేసి ఓడిపోయారు.

Share this on your social network: