టీఆర్‌ఎస్‌తో వైసీపీ ముసుగు రాజకీయాలు

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, ప్రధాని మోదీకి చెంపపెట్టులాంటివని మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎ్‌సతో వైసీపీ ముసుగు రాజకీయాలు చేస్తోందంటూ మండిపడ్డారు. తెలంగాణ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ఎక్కడున్నా తెలుగు ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుందని మరోసారి స్పష్టం చేశారు. ఏపీలో కాంగ్రె్‌సతో పొత్తుపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. అమరావతి సచివాలయంలో మంత్రి నక్కా ఆనందబాబు, తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో మంత్రి చినరాజప్ప, మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, చిత్తూరులో మంత్రులు అమరనాథరెడ్డి, సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తూ అధికారాన్ని అడ్డంపెట్టుకొని గెలిచారని విమర్శించారు. టీఆర్‌ఎస్ వేలకోట్ల రూపాయలను కుమ్మరించిందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల్లో ఇంకా బలంగా నాటుకొని ఉన్న సెంటిమెంట్‌కు, డబ్బులు తోడయ్యాయని మంత్రులు స్పష్టం చేశారు.

Share this on your social network: