నమ్మించి మోసం చేస్తే ఇంట్లో పడుకోవాలా?
Published: Friday December 14, 2018

రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగేలా ఎవరైనా దొంగ దెబ్బ తీయాలని చూసినా, నమ్మకద్రోహం చేసినా బొబ్బిలిపులిలా తిరగబడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. విశాఖపట్నం జిల్లా తగరపువలసలో గురువారం సాయంత్రం ఏర్పాటుచేసిన ఆత్మీయ సభలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెడతా, చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదేదో అంటున్నారు. అటువంటి మాటలకు భయపడే స్థాయిలో లేను. తెలుగు ప్రజల కోసం ఏమి చేయడానికైనా తెలుగుదేశం సిద్ధంగా ఉంది. లాలూచీ రాజకీయాలు చేసిన వారంతా చరిత్రహీనులవుతారు’ అని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే ఆర్థిక కష్టాలు తగ్గి ఉండేవన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, అప్పుడు కేసీఆర్ కూడా హోదా ఇవ్వాలన్నారని.. కానీ ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని ఆక్షేపించారు. హోదా ఇవ్వొద్దని చెబుతున్నటీఆర్‌ఎస్‌ను జగన్, పవన్‌కల్యాణ్ సమర్థిస్తున్నారని.. దీనిని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.
కేంద్రం సహకరించకపోయినా మన కష్టం మనకు ఉపయోగపడిందని చెప్పారు. ఆంధ్ర అంటే ప్రధాని మోదీకి అసూయని.. అందుకు నిధులివ్వడం లేదని.. సాయం చేస్తే గుజరాత్ కంటే ఎక్కువ అభివృద్ధి చెందుతామనే వివక్ష చూపుతున్నారని దుయ్యబట్టారు. ‘నమ్మించి మోసం చేస్తే ఇంట్లో పడుకోవాలా? రాష్ట్రానికి ఇది పరీక్షా సమయం. కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టాలి’ అని ప్రజలకు పిలుపిచ్చారు.రాష్ట్రాభివృద్ధి కోసం తాను రేయింబవళ్లు పనిచేస్తుంటే కేసులకు భయపడిన వైసీపీ నాయకులు కేంద్రంతో లాలూచీపడ్డారని చెప్పారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం సహకరించకపోయినా పనులు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 62 ప్రాజెక్టులు పూర్తిచేస్తున్నామని గుర్తుచేశారు. దేశంలో వ్యవసాయ రంగం 2.4 శాతం వృద్ధి చెందితే ఒక పక్క కరువు తాండవించినా రాష్ట్రంలో 11 శాతం వృద్ధి నమోదైందన్నారు. ఇంత జరిగినా మోదీ సహకరించడం లేదు సరికదా.. కేసీఆర్, జగన్, పవన్‌లను మనపైకి ఎగదోస్తున్నారని ఆరోపించారు.

Share this on your social network: