నేతల పనితీరుపై చంద్రబాబు సమీక్ష

Published: Thursday December 20, 2018

శ్రీకాకుళం: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో మరింత బలం పెంచుకునేందుకు టీడీపీ ముమ్మర సన్నాహాలు చేస్తోంది. సాధ్యమైనన్ని ఎక్కువ సభ్యత్వాలు చేపట్టేలా కృషి చేస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ సభ్యత్వాలు అనుకున్న లక్ష్యానికి చేరుకునేలా కసరత్తు చేస్తున్నారు. నత్తనడకగా నడుస్తున్న నియోజకవర్గాలను గుర్తించి, స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర నేతల పనితీరుకు సభ్యత్వాల నమోదు ప్రాతిపదికే అంటూ హెచ్చరిస్తున్నారు. సభ్యత్వాల తీరుపై బుధవారం చంద్ర బాబు జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షురాలితో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సభ్యత్వాలను పరుగులు తీయించాలని... ఇందుకు మరో వారం గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గాల వారీగా సభ్యత్వాల తీరుపై సమీక్షించారు. ప్రస్తుతం సభ్యత్వాల నమోదులో టెక్కలి, ఆ తర్వాత పలాస ఉన్నట్లు జిల్లా పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీష సీఎంకు వివరించారు. అయితే జిల్లాలో 5.53 లక్షల లక్ష్యం చేరుకోవాల్సిందేనని అధినేత స్పష్టం చేశారు.