హామీలను వంద శాతం అమలుచేశాం
Published: Sunday December 23, 2018

నవ్యాంధ్ర ప్రజల సంక్షేమానికే బీజేపీ నుంచి టీడీపీ బయటకు వచ్చిందని, అయితే ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్రం లో వైసీపీ, జనసేన పార్టీలు దత్తపుత్రులుగా మారాయని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం సభలో మాట్లాడుతూ.. 2014లో రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని, ఆ సమయంలో తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీతోపాటు రాజ్యాంగబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలను అమ లు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగున్నరేళ్లపాటు ఆ పార్టీతో ఉండి పోరాటాలు చేశామని, అయితే బీజేపీ కుట్ర, నమ్మకద్రోహంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. దీనిని ప్రజల ముందుకు తీసుకువెళ్లేం దుకు ఈ పోరాట దీక్షలను చేపడుతున్నామన్నారు.
తెలంగాణలో టీఆర్‌ఎస్ విజయం సాధిస్తే నవ్యాంధ్రలో సంబరాలు చేసుకున్న వైసీపీ తీరును ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. విజయగర్వంతో ఉన్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జాతీయస్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుచేస్తామని ప్రకటించారని, అది మోదీ కనుసన్నల్లోనే ఏర్పాటు కానుందని చెప్పారు. తితలీ తుఫాన్ సమయంలో జిల్లా కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగన్‌కు బాధిత ప్రజలను పరామర్శించే తీరిక లేకుండా పోయిందని విమర్శిం చారు. ఎన్నికల సమయంలో తామిచ్చిన హామీలను వంద శాతం అమలుచేశామని గుర్తుచేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Share this on your social network: