ద్రోహానికీ హద్దులుంటాయి

Published: Monday December 24, 2018
విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి చేయాల్సినవి, పార్లమెంటులో నాటి ప్రధాని ఇచ్చిన హామీలను.. నెరవేర్చకుండా కక్ష, కసితో వ్యవహరించిన ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి ఎందుకొస్తున్నారు? చచ్చామో బతికున్నామో చూడ్డానికా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. కేంద్రం రాష్ట్రానికి చేసిన ద్రోహం, నవ్యాంధ్ర స్థితిగతులు, నాలుగున్నరేళ్లలో కష్టపడి సాధించిన అభివృద్ధి, భవిష్యత్‌ ప్రణాళికలపై శ్వేతపత్రాల విడుదలలో భాగంగా మొదటి శ్వేతపత్రాన్ని ఆదివారం ఉండవల్లి ప్రజావేదికలో ఆయన విడుదల చేశారు. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా చేసిన ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-సంబంధిత హామీల అమలుపై దీనిని ప్రచురించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘ద్రోహానికి కూడా హద్దులుంటాయి. కానీ మోదీ అవీ దాటేశారు. ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా.. అణగదొక్కేయాలని చూశారు.
 
అలాంటి వ్యక్తి రాష్ట్రానికి వస్తుంటే వైసీపీ, జనసేన ఎందుకు ప్రశ్నించడం లేదు? ఎందుకు నిలదీయడం లేదు? రాజకీయం వేరు..ప్రజాహితం వేరు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వస్తుంటే ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని వైసీపీ, ఇతర పార్టీలు ప్రశ్నించవేం? మోదీ.. మీరు రాష్ట్రానికి ఇవ్వాల్సింది ఇచ్చేయండి. వచ్చి మీ సిద్ధాంతాలు చెప్పుకోండి. అభ్యంతరం లేదు. కానీ ఏమీ చేయకపోగా.. అణగదొక్కేందుకు ప్రయత్నించి వస్తున్న బీజేపీని ఆ పార్టీలు ఎందుకు దోషిగా నిలబెట్టవు. ఒకప్పుడు టీఆర్‌ఎస్‌ కూడా ప్రత్యేక హోదాకు మద్దతిచ్చింది. ఆ పార్టీ ఎంపీ కవిత, ఇతర నేతలు హోదాకు మద్దతిచ్చారు. కానీ ఇటీవల తెలంగాణ ఎన్నికలప్పుడు ఆంధ్రకు హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మన రాష్ట్రానికి హోదా వద్దన్నవారు గెలిస్తే ఇక్కడ వైసీపీ సంబరాలు చేసుకోవడమేంటి? వీరికి డబ్బులొస్తాయనా? రాష్ట్ర ప్రయోజనాలు అన్నింటికంటే ముఖ్యం. కానీ స్వప్రయోజనాల కోసం వాటిని తాకట్టు పెట్టేశారు. బీజేపీ, వైసీపీ, జనసేతో సహా అంతా కలిసి కుట్రలు చేస్తున్నారు. ప్రజలు దీనిపై చైతన్యం కావాలి.’