టీఆర్‌ఎస్‌ గెలిస్తే మీకేల ఆనందం?.

Published: Wednesday January 02, 2019
 ప్రధాని మోదీ వల్ల దేశానికి ఏం లాభం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ఈడీ, సీబీఐ, ఐటీ, ఆర్‌బీఐ సహా సమస్త వ్యవస్థల్నీ ఆయన భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు. చివరకు సుప్రీంకోర్టుకు కూడా తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆక్షేపించారు. తాను ఆక్రోశంతో మాట్లాడుతున్నానని మోదీ అనడంపై అభ్యంతరం తెలిపారు. ‘నేను ప్రాక్టికల్‌గా మాట్లాడుతున్నాను. ఆయన ఢిల్లీలో కూర్చుని ఏదంటే అది మాట్లాడుతున్నారు. ఈ అంశాలపై ఆయన చర్చకు సిద్ధమా’ అని సవాల్‌ విసిరారు. దేశంలో అవినీతిని మోదీ ఏ మాత్రం తగ్గించారని నిలదీశారు. రాఫెల్‌ ఒప్పందంలో అవకతవకలపై ఏం చెబుతారని అడిగారు. ‘బ్యాంకులను ముంచిన అవినీతిపరులు దేశాన్ని వీడి దర్జాగా వెళ్లిపోతున్నారు. దేశంలో ప్రగతి రేటు పడిపోయింది. ప్రజల ఆదాయం క్షీణించిపోయింది.
 
మోదీ ఆర్థిక, పాలనా విధానాలు దేశాన్ని ఇరవై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాయి. ప్రతిపక్ష కూటమి విఫలం కాలేదు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి వారి నమ్మకం నిలుపుకోవడంలో మోదీ, ఎన్డీఏ కూటమే విఫలమయ్యాయి’ అని ఆయన అన్నారు. శ్వేతపత్రం విడుదల కోసం మంగళవారమిక్కడ ప్రజా వేదిక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రతిపక్ష కూటమి, ఫెడరల్‌ ఫ్రంట్‌, కేసీఆర్‌, టీడీపీలపై మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయి. వాటిపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ మోదీ గూటి చిలకేనని స్పష్టం చేశారు. ‘ప్రతిపక్షాలు రెండు కూటములుగా చీలిపోయాయని, ఫెడరల్‌ ఫ్రంట్‌లో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చేరారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆ ఫ్రంట్‌లో చేరామని మమత, నవీన్‌ పట్నాయక్‌ ఎక్కడైనా చెప్పారా? వాళ్లు చెప్పకుండానే ఫెడరల్‌ ఫ్రంట్‌కు వీళ్లెందుకు ప్రచారం చేస్తున్నారు? దీనినిబట్టే ఆ ఫ్రంట్‌ ఎవరిదో తెలిసిపోతోంది. ఉనికిలోనే లేని ఫ్రంట్‌కు ప్రచారం కల్పించాలని మోదీ, జైట్లీ తాపత్రయపడుతున్నారు. ప్రతిపక్షాలు చీలిపోయాయని ప్రజలను నమ్మించగలిగితే తమకు లాభం వస్తుందని లెక్కలు వేసుకుని ఆ ఫ్రంట్‌ను ప్రోత్సహిస్తున్నారు. ఉన్నవి రెండే కూటములు. ఒకటి బీజేపీ అనుకూల కూటమి.. రెండోది బీజేపీ వ్యతిరేక కూటమి. మమత బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నారు’ అని తేల్చిచెప్పారు.