ప్రజాసేవకు జన్మభూమి అద్భుత అవకాశం

Published: Friday January 04, 2019
అమరావతి: జన్మభూమి గ్రామసభల్లో ప్రజా స్పందన బాగుందని, ఇదే స్ఫూర్తి ఇకపై కూడా కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శుక్రవారం జన్మభూమి-మాఊరుపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడతూ పరిపాలనలో పారదర్శకత, ప్రజాభిప్రాయానికి జన్మభూమి గొప్ప వేదిక అని అన్నారు. వినూత్న ఆలోచనలు, నూతన ఆవిష్కరణలకు జన్మభూమి కేంద్రమని పేర్కొన్నారు. జన్మభూమి కార్యక్రమంలో అభివృద్ధి ప్రణాళికలను ఖరారు చేస్తున్నామని, నిర్దిష్టమైన కార్యాచరణ చేపడుతున్నామని చెప్పారు.
 
ప్రజాసేవకు జన్మభూమి అద్భుత అవకాశమని అన్నారు. ప్రజల్లో మమేకమయ్యే అవకాశాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు అంది పుచ్చుకోవాలని సూచించారు. సులభతర వాణిజ్యంలో ఏపీ దేశంలోనే నెంబర్ వన్‌లో నిలిచిందని లీక్వాన్ యూ స్కూల్ సర్వే వెల్లడించిందన్నారు. జన్మభూమిపై ప్రజల్లో 79% సంతృప్తి నెలకొందన్నారు. మరోవైపు టెలికాన్ఫరెన్స్‌లో ర్యాండమ్ సర్వే చేయించిన సీఎం జన్మభూమిలో ఆనందంగా పనిచేస్తున్నారా? అని అధికారులకు ప్రశ్నించారు. జన్మభూమిలో 98% ఆనందంగా పనిచేస్తున్నామని అధికారులు చెప్పారు. దీంతో అదే సంతోషం, సంతృప్తి ప్రజల్లో కూడా రావాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు.