రాష్ట్ర స్థాయిలో టీడీపీతో పొత్తుండదు: నారాయణ

Published: Sunday January 06, 2019

‘‘రాష్ట్ర స్థాయిలో టీడీపీకీ మాకూ పడదు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ పార్టీకి మాకూ పడదు. కానీ జాతీయ స్థాయిలో మాత్రం కలిసి పనిచేస్తాం. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా జనసేన మాతో కలిసి వస్తే బాగుంటుంది. రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం, జనసేన కలిసి పనిచేస్తాయి. అందులో మార్పు లేదు. తెలంగాణలో కూటమి కొనసాగుతుంది. దావూద్‌ ఇబ్రహింతో కన్నా దేశానికి బీజేపీతోనే ఎక్కువ ప్రమాదం. అందుకనే బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే అన్ని శక్తులను కలుపుకొని వెళ్లాలని మా పార్టీ నిర్ణయించింది’’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ స్పష్టం చేశారు. ‘‘మోదీ విధానాలు ఇలానే కొనసాగితే రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, ఇతర కేంద్రీయ సంస్థలు ధ్వంసమవుతాయి. పార్లమెంటరీ వ్యవస్థకు, రాజ్యాంగానికి ప్రధాని నుంచే ప్రమాదం ఏర్పడింది. అందుకే మేం దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించాలని పిలుపునిచ్చాం. ఫ్రంట్‌గా ఏర్పడుతున్నాం. రాఫెల్‌ డీల్‌లో ప్రధాని బ్రోకర్‌లా వ్యవహరించారు’’ అని వ్యాఖ్యానించారు.