జగన్ 30 ఏళ్లు అంటారు.. బాబు మరో పదేళ్లంటారు
Published: Friday January 11, 2019

‘ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి 30 ఏళ్లు సీఎంగా ఉండాలని ఉందంటారు. చంద్రబాబు మరో దశాబ్దకాలం మేమే ఉండాలంటారు. అసలు సీఎం అవ్వాలంటే రాష్ట్రంలో మూడుతరాలు బాగుపడాలన్న ఆకాంక్ష ఉండాలి’ అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. సంక్రాంతి తర్వాత పార్టీ కమిటీలను వేస్తానని ప్రకటించారు. గురువారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కడప, గుంటూరు జిల్లాల నేతలతో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నేతలెవరినీ తాను వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. సైద్ధాంతికపరమైన ఫ్రేమ్‌వర్క్‌లో వారి గురించి మాట్లాడానని చెప్పారు. ‘జగన్‌లా చంపేయండి, చింపేయండని అనలేదు. ఎప్పుడు విమర్శ చేసినా సంస్కారవంతంగా.. ఆదర్శవంతమైన భాషను ఉపయోగించాను’ అని తెలిపారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
‘మార్పు కోసమే 2014లో జనసేనను ప్రారంభించాను. మూడో పార్టీ లేకుంటే.. ఉన్న రెండు పార్టీలు తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసే ప్రమాదం ఉన్నందున మధ్యేమార్గంగా పార్టీని పెట్టాను. ప్రజారాజ్యం పెట్టకముందే నేను కామన్‌మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాను. ఆ సమయంలో నాతోపాటు ఉన్నవారే జనసేన ఆవిర్భావ సమయంలో నాతో ఉన్నారు. పోరాటం చేసే వారికే గెలుపు సిద్ధిస్తుంది. గెలుపు కోసమే పనిచేస్తే అది దోబూచులాడుతుంది. నాకు ముఖ్యమంత్రిగా పనిచేయాలని ఉందంటూ ఓ పక్కన జగన్ అంటుంటే.. మళ్లీ సీఎంను చేయాలని చంద్రబాబు అంటున్నారు. అధికారం కోసం ఆలోచించేవారికి ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉండదు. ఇది మనకు చరిత్ర చెబుతున్న పాఠం. రాజకీయాలు నాకు వ్యాపారం కాదు. స్టార్‌డమ్ ఉన్నప్పుడే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేశాను. 2003 నుంచి డబ్బు ప్రభావిత రాజకీయాలు మన తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయాయి. ఆ సమయంలోనే ఇటువంటి వ్యవస్థను మార్చడానికి ఒక నాయకుడు అవసరమని భావిస్తున్న తరుణంలో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించారు.
అయితే.. లక్ష్యసాధనలో పక్కనున్నవారే ఆయన్ను నిరాశకు గురిచేశారు. అటువంటి స్థితి తర్వాత నేను జనసేనను స్థాపించి కోట్లాది మంది జనం అభిమానం పొందుతున్నానంటే నేనెంత మొండివాడినో అర్థం చేసుకోవచ్చు. కొత్త పార్టీలో కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి. వీటిని ఎదుర్కొనే ధైర్యం, సత్తా జనసేన శ్రేణులకు ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఏ జిల్లాలో చూసినా రాజకీయం కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉంది. ఎదుటివారిని ప్రశ్నించాలంటే మనకు నైతిక బలం ఉండాలి. ఈ నైతిక బలం కోసమే 2014 సమయంలో రాష్ట్రంలో తెలుగుదేశానికీ , కేంద్రంలోని బీజేపీకి మద్దతు పలికాను. 2014లో పరిమిత స్థానాల్లో పోటీ చేద్దామని తొలుత భావించాను. అలా చేస్తే పార్టీ బలపడదన్న ఆలోచనతో పోటీకి దూరంగా ఉండిపోయాను. జనసేన మద్దతిచ్చిన టీడీపీ, బీజేపీ రాష్ట్రంలో విజయం సాధించాయి. మోదీ ప్రధాని అయితే ఆంధ్రకు మేలుచేస్తారన్న గట్టి నమ్మకమే ఆయనకు సపోర్టు చేయడానికి కారణం. వ్యవస్థను రాత్రికి రాత్రే మార్చలేమన్న విషయం నాకూ తెలుసు. ఎంత ఒత్తిడి ఉన్నా నేనే తీసుకుంటాను. కార్యకర్తలపై రుద్దను. జనసైనికులంతా నాయకులుగా మార్పు చెందాలి. రాబోయే ఎన్నికలు మన ముందున్న పెద్దసవాలు. మనకు యువత, మహిళలు అండగా ఉన్నారు. కవాతులకు లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చారంటే అది వారిలోని ఆగ్రహాన్ని తెలియపరుస్తోంది.’

Share this on your social network: