చంద్రబాబు మా కుటుంబానికి అండగా నిలిచారు

Published: Saturday January 12, 2019
 ‘‘మా నాన్న భూమా నాగిరెడ్డి చనిపోతే సీఎం చంద్రబాబు మా కుటుంబానికి అండగా నిలిచారు. ఆళ్లగడ్డ అభివృద్ధి కోసం రూ.1000 కోట్లు నిధులు ఇచ్చారు. నన్ను మంత్రిని చేసి మా కుటుంబానికి రాజకీయంగా చేయూతనిచ్చారు. అలాంటి చంద్రబాబును, టీడీపీని వీడాల్సిన అవసరం నాకు లేదు’’ అని మంత్రి భూమా అఖిల ప్రియ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా రుద్రవరంలో ఆమె ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ‘‘జనసేనలో చేరుతున్నానని వస్తున్న పుకార్లు నమ్మవద్దు. నమ్మి కార్యకర్తలు మోసపోవద్దు. ఆ పార్టీలో చేరాల్సిన అవసరం నాకు లేదు. రేటింగ్స్‌ కోసం ఓ చానెల్‌ దుష్ప్రచారం చేస్తోంది. నేను, మా అన్న నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి రానున్న ఎన్నికల్లో ఊహించని మెజారిటీతో గెలుస్తాం. ఆ విజయాలను సీఎం చంద్రబాబుకు బహుమతిగా ఇస్తాం. గన్‌మెన్‌ను ఉపసంహరించుకున్న విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లాను’’ అని అఖిల ప్రియ పేర్కొన్నారు.