జగన్ ప్రకటించిన అభ్యర్థికి ..చుక్కెదురు

Published: Sunday January 20, 2019
మండలంలోని కొర్రపాడులో వైసీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవికి పార్టీ శ్రేణుల నుంచి చుక్కెదురైంది. వివరాలిలా ఉన్నాయి... నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్‌ శ్రీదేవి గత కొంత కాలంగా అన్ని గ్రామాలకు వెళ్లి కార్యకర్తలు, నాయకులను కలసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, గ్రామాల సమస్యలను తెలియజేయాల్సిందిగా కోరుతున్నారు. అందులో భాగంగానే కొర్రపాడు వెళ్లిన డాక్టర్‌ శ్రీదేవి గ్రామంలోని ఒక నాయకుడి ఇంటికి వెళ్లడంతో మరోవర్గం వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పార్టీ అధ్యక్షుడిని లేదా పార్టీ ఎంపీటీసీ సభ్యులను కలవాలంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో డాక్టర్‌ శ్రీదేవి వెంట ఉన్న మరికొందరు నాయకులతో పాటు పేరేచర్ల ఎంపీటీసీ సభ్యులు షేక్‌ అబ్ధుల్‌ రసూల్‌, మన్నవ రాజేష్‌లు కల్పించుకొని సర్దిచెప్పేందుకు యత్నించారు. అయినా గ్రామంలో మరో బజారుకు వెళుతున్న డాక్టర్‌ శ్రీదేవి కారును అడ్డుకున్నారు.
 
 
మేడికొండూరు మండలంలోకి వచ్చే సమయంలో మండల పార్టీ అధ్యక్షుడికి తెలియజేయకుండా ఎలా వస్తారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు కావాలనే వివాదానికి దిగుతున్నారని డాక్టర్‌ శ్రీదేవి సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో ఆగ్రహించిన కొందరు కార్యకర్తలు డాక్టర్‌ శ్రీదేవి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొద్దిసేపటి తరువాత అమె గ్రామంలో పర్యటించకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. ఆమె వెంట వైసీపీ నాయకులు ముత్యాల బాలస్వామి, కోకా అర్జునరావు, తాళ్లూరి వంశీకృష్ణ మరికొందరు నాయకులున్నారు.