కాపులకు రిజర్వేషన్ల పేరుతో మరోమారు కుట్ర

Published: Thursday January 24, 2019
వైసీపీ అధినేత జగన్‌ పాదయాత్ర విజయవంతం కావడం, ప్రజాదరణ చూసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని వైసీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. గుంటూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓబీసీలకు పది శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నామని కేంద్రం ప్రకటించగానే కాపు ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు రాజకీయ ఎత్తుగడ వేసి ఐదు శాతం రిజర్వేషన్‌ కల్పిస్తానని చంద్రబాబు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ఏపీ నుంచి కనీస ప్రతిపాదనలు పార్లమెంటుకు పంపకుండా ఐదు శాతం రిజర్వేషన్‌ ఎలా పొందుతారని ప్రశ్నించారు.
 
రాజకీయ అనుభవం ఉందన్న చంద్రబాబు ఏమాత్రం అవగాహన లేకుండా కాపులను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో జనసేనతో పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పొత్తులేకుండా పోటీ చేయలేరన్న ఆయన. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఏ పొత్తు లేకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళుతుందని స్పష్టం చేశారు. మాయమాటలతో మభ్యపెట్టే చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. సమావేశంలో వైసీపీ నాయకులు మెట్టు వెంకటప్పారెడ్డి, మేరిగ విజయలక్ష్మి ఉన్నారు.