వైసీపీతో కలిసి నడవాలని నిర్ణయం
Published: Monday January 28, 2019

వైసీపీతో కలిసి నడవాలని తన కుమారుడు హితేశ్ చెంచురాం నిర్ణయించినట్లు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ అంశంపై ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌తో ఆయన సమావేశమై చర్చించారు. ఆదివారం హైదరాబాద్ లోట్‌సపాండ్‌లోని జగన్ నివాసంలో కుమారుడు హితేశ్‌తో కలిసి వైసీపీ అధ్యక్షుడితో దగ్గుబాటి భేటీ అయ్యారు. దగ్గుబాటి ద్వయంతో జరిగిన ఈ చర్చల్లో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన స్వీయ రచనలు ‘ది అదర్‌సైడ్ ఆఫ్ ది ట్రూత్’, ‘ప్రపంచ దేశాల పాలనా వ్యవహారాలు’ పుస్తకాలను జగన్‌కు దగ్గుబాటి అందజేశారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ఈ భేటీలో ప్రస్తుత జాతీయ, ఏపీ రాజకీయాలపై చర్చ జరిగింది.
ఇటీవల తెలంగాణ ఎన్నికల ఫలితాలూ చర్చకు వచ్చాయి. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జగన్ పాదయాత్ర, సీఎం చంద్రబాబు పాలనపైనా వారిద్దరూ చర్చించుకున్నారు. డ్వాక్రా సంఘాలకు పోస్టు డేటెట్ చెక్కు లు ఇవ్వడంపైనా.. ఐదో విడత రైతు రుణమాఫీపైనా చర్చ సాగింది. తాము పార్టీ నియమావళి మేరకు నడచుకుంటామని.. తన కుమారుడు హితేశ్ పర్చూరు శాసనసభా నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున బరిలోకి దిగాలన్న యోచనలో ఉన్నారని జగన్‌కు దగ్గుబాటి వివరించారు.

Share this on your social network: