పథకాలు అమలుచేయడానికి చిల్లిగవ్వ లేదు

Published: Wednesday January 30, 2019

ఎన్నికల వేళ ప్రభుత్వం భారీగా ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలు అమలుచేయడానికి ఖజానాలో చిల్లిగవ్వ లేదు. నిధుల సమీకరణ కోసం ఆర్థికశాఖ రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నప్పటికీ... కొత్త సంక్షేమ పథకాల రూపంలో ఖజానాపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. యువనేస్తం, ఆదరణ లాంటి పెద్ద సంక్షేమ పథకాలను డిసెంబరులోనే ప్రారంభించడంతో ఖర్చు తడిసిమోపెడవుతోందని ఆర్థికశాఖ అధికారులు తెలిపారు. బడ్జెట్‌లో పెట్టినవిధంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడం, 2014-15 సంవత్సరం నాటి ఆర్థిక లోటు ఇవ్వకపోవడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చాయి. అందుబాటులో ఉన్న వనరులతో ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్చి వరకు ఖజానాను నడిపిస్తామని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో బిల్లుల చెల్లింపులు నిలిపివేశారు. ఒకటో తేదీన ప్రభుత్వోద్యోగులకు వేతనాలు చెల్లించిన తర్వాత డబ్బులు మిగిలితే కొన్ని బిల్లులు చెల్లించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం 4, 5 విడతల రైతు రుణమాఫీ కోసం రూ.8,000 కోట్లు, వడ్డీలేని రుణాల కోసం రూ.2,000 కోట్లు, పెండింగ్‌ బిల్లులకు రూ.2,500 కోట్లు, ఈ 2 నెలలపాటు పెరిగిన పింఛన్ల కోసం రూ.1800 కోట్లు, డ్వాక్రా మహిళలకు రూ.9,500 కోట్లు అవసరంకాగా.. వీటిని మూడు వాయిదాల్లో చెల్లించాలని భావిస్తున్నారు. సబ్సిడీల రూపంలో రూ.10,000 కోట్లు చెల్లించాల్సి ఉంది.