ఒంటరి పోరుకు నేను వ్యతిరేకం

Published: Thursday January 31, 2019

 ‘రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయాలని, పొత్తులు ఉండవని కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీలో పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చాను. నాతో ఎవరూ మాట్లాడలేదు. టూ లేట్‌.. ఇప్పుడు రాహుల్‌గాంధీ ఫోన్‌ చేసినా కాంగ్రె్‌సలో ఉండలేను’ అని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం రాత్రి తన సతీమణి, డోన్‌ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, తనయుడు రాఘవేంద్రరెడ్డితో కలిసి ఆయన అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసిన సంగతి తెలిసిందే. సమావేశానంతరం బుధవారం కర్నూలుకు చేరుకున్న ఆయనకు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోట్ల విలేకరులతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబుతో మా కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా సన్నిహిత సంబంధం ఉంది. దాంతోనే మమ్మల్ని కలవాలని ఆయన ఆహ్వానించడంతో వెళ్లాం. టీడీపీలో చేరాలని ఆయన నన్ను కోరలేదు. జిల్లాలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు’ అని తెలిపారు. కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో నిత్యం వెంటాడుతున్న కరువును శాశ్వతంగా పరిష్కరించాలంటే గుండ్రేవుల జలాశయం, వేదవతి ప్రాజెక్టు, ఎల్లెల్సీ బైపాస్‌ పైప్‌లైన్‌ నిర్మించాలని సీఎంకు సూచించానన్నారు. వేదవతి ప్రాజెక్టుకు సీఎం జీవో ఇచ్చారని.. గుండ్రేవుల ప్రాజెక్టు ఇస్తేనే రైతుల సమస్య శాశ్వతంగా తీరుతుందని తెలిపారు. తనను పార్టీలోకి ఆహ్వానించేందుకు టీడీపీ, వైసీపీ, బీజేపీ నాయకులు కలిసిన మాట వాస్తవమేనని, కార్యకర్తల నిర్ణయమే తనకు శిరోధార్యమని, వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని తెలిపారు. చివరకు స్వతంత్రంగా పోటీ చేయాలన్నా సిద్ధమేనన్నారు. ఆయన కార్యకర్తలు, ముఖ్య నేతలతో విడివిడిగా సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకుని.. టీడీపీలో చేరే అవకాశం ఉందని కోట్ల వర్గీయులు పేర్కొంటున్నారు. ఫిబ్రవరి 6న టీడీపీలో చేరతారని అనుకున్నారు. అయి తే.. 6, 7 తేదీల్లో కోట్ల బంధువుల పెళ్లి ఉండడంతో.. 8 తర్వాత చేరే అవకాశముందని చెబుతున్నారు.