నల్లచొక్కాతో అసెంబ్లీకి సీఎం చంద్రబాబు

Published: Friday February 01, 2019
అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సీఎం చంద్రబాబు నల్లచొక్కాతో హాజరయ్యారు. ఎమ్మెల్యేలతో పాటు చంద్రబాబు కూడా నల్లచొక్కా ధరించి రాష్ట్రానికి చేసిన అన్యాయంపై కేంద్రానికి నిరసన తెలియజేశారు. టీడీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది నల్లచొక్కాల్లోనే అసెంబ్లీకి రాగా, కొందరు నల్లచొక్కా, నల్లప్యాంటు వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. అందరూ మూకుమ్మడిగా కేంద్రంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
 
ఏపీ హక్కుల సాధనకు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు సీఎం కార్యచరణ ప్రకటించారు. విభజన చట్టం అమలులో కేంద్రం మొండి చేయి చూపిస్తున్నందుకు నిరసనగా ఫిబ్రవరి 1న నిరసన దినంగా పాటించాలని సీఎం పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా అమలును నీరుగారుస్తున్న ప్రధాని మోదీ వ్యవహార సరళిని ఆయన ఖండించారు. ఏపీకి సహకారం అందివ్వడంలో కేంద్రం వివక్ష చూపడానికి నిరసనగా ఎమ్మెల్యేలను నల్లదుస్తులు ధరించాలని సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఎమ్మెల్యేలు నల్లదుస్తులు ధరించి అసెంబ్లీకి వచ్చారు.