చంద్రబాబు దీక్షపై జగన్ విమర్శ
Published: Sunday February 10, 2019

‘ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ఎన్డీయేలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు ఎప్పుడూ అడగలేదు. ఇప్పుడేమో యూటర్న్ తీసుకుని, నల్లచొక్కాలేసుకుని దీక్ష చేయడమంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది’ అని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎ్‌సఎల్ నరసింహన్‌ను జగన్ శనివారం ఇక్కడ రాజ్‌భవన్‌లో కలిశారు. పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. ఆపై జగన్ విలేకరులతో మాట్లాడారు.
ఒక వ్యక్తిని తానే పొడిచి, ఆ హత్యకు వ్యతిరేకంగా దీక్ష చేసినట్లుగా చంద్రబాబు పోరాటం ఉందన్నారు. ‘ఆయన ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండటం మన ఖర్మ. ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగార్చేలా అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడారు. హోదా ఉన్న రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి? అదేమన్నా సంజీవనా? అని ప్రతిపక్షాలను తిట్టారు. ప్రత్యేక ప్యాకేజీ వల్లే ఏపీకి లాభం జరుగుతుందని, చంద్రబాబు వల్లే కేంద్రం దాన్ని ఇచ్చిందని మంత్రులు ప్రచారం చేశారు. 2018 జనవరి 27వ తేదీన మీడియా సమావేశం పెట్టి మరీ కేంద్రాన్ని చంద్రబాబు పొగిడారు. ఏపీ కంటే ఎక్కువగా ఏ రాష్ట్రానికైనా కేంద్రం మేలు చేసిందా అని ప్రశ్నించారు. నాలుగేళ్లు ఎన్డీయేతో సంసారం చేసి, బీజేపీని చంద్రబాబు తన భుజాలపై మోశారు’ అని జగన్ పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఇటీవల కలిసి చెప్పిన విషయాలనే గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. ఏపీలో దాదాపు 59 లక్షల దొంగ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.
‘టీడీపీకి అనుకూలంగా, వ్యతిరేకంగా ఉన్నదెవరో తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆ పార్టీ వాడుకుంటోది. ప్రజాసాధికార సర్వే, రియల్‌టైం గవర్నెన్స్, పరిష్కార వేదికల పేరుతో సర్వేలు చేయిస్తూ ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు. వారిలో టీడీపీకి ఓటు వేయబోమని చెబుతున్న వాళ్లు, వైసీపీ మద్దతుదారులు, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై సంతృప్తిగా లేని వాళ్ల ఓట్లను తొలగిస్తున్నారు. సొంత లాభం కోసం ఏపీలో పోలీసులను టీడీపీ దారుణంగా వాడుకుంటోంది. పోలీసు వ్యవస్థను చంద్రబాబు భ్రష్టుపట్టిస్తున్నారు’ అని జగన్ విమర్శించారు.

Share this on your social network: