వలసల వెనుక కేసీఆర్, కేటీఆర్
Published: Wednesday February 20, 2019

హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌పై రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. సోమవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్‌లో ఆస్తులు పోతాయనే కొందరు నేతలు పార్టీ మారుతున్నారని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ వీళ్లతో మాట్లాడి పార్టీ మార్పిస్తున్నారని వ్యాఖ్యానించారు. దమ్ముంటే కేసీఆర్, కేటీఆర్ ఏపీకి వచ్చి జగన్‌తో కలిసి పోటీ చేయాలని సవాల్ విసిరారు. కేసుల నుంచి బయటపడడానికి మోదీకి జగన్ ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. బీసీల గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని, అసలు బీసీలలో ఎన్ని కులాలు ఉన్నాయో తెలుసా అని మంత్రి ప్రశ్నించారు. ఎంపీ కాకముందు రవీంద్రపై జగన్ పత్రికలో వచ్చిన వ్యతిరేక కథనాలపై ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ఆయన నిలదీశారు.
కాగా, టీడీపీలో గెలిచే వారికే చంద్రబాబు టికెట్లు ఇస్తారని, గెలవలేం అనుకున్న వాళ్లే పార్టీ మారుతున్నారని ఎంపీ గల్లా జయదేవ్ ఉండవల్లిలో విమర్శించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి కడపలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌పై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా, ప్రజా సంకల్ప యాత్ర పేరుతో కాలక్షేప యాత్ర పూర్తి చేసి ముఖ్యమంత్రి సీటు కోసం పరితపిస్తున్న జగన్‌ను పులివెందుల అసెంబ్లీ బరి నుంచే నిలువరిస్తామన్నారు. తమ టార్గెటే పులివెందుల అని తేల్చి చెప్పారు. కాగా, వైసీపీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పరాభవం తప్పదన్నారు. రాష్ట్రంలోని కౌలు రైతులకు సీఎం చంద్రబాబు స్వర్ణయగం అందించారని, ‘అన్నదాత సుఖీభవ’ను సృష్టించిన ఘనత చంద్రబాబుదే అని ఉండవల్లిలో వ్యాఖ్యానించారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ విజయవాడలో మాట్లాడుతూ.. రవీంద్రబాబు టీడీపీ ఎంపీగా నాలుగేళ్లు ఉండి, ఇప్పుడు జగన్ పంచకు చేరి సీఎంపై విమర్శలు చేయడం దుర్మార్గమన్నారు.

Share this on your social network: