చీకటి రాజకీయాలు ఎందుకు?

‘‘చీకటి రాజకీయాలు, తెర వెనక కుట్రలు ఎందుకు? ఆంధ్రప్రదేశ్‌పై అంత కక్ష ఎందుకు? ముసుగు తీసేసి... బహిరంగంగా రండి! మోదీ-బీజేపీ, కేసీఆర్- టీఆర్‌ఎస్, జగన్-వైసీపీ... ముగ్గురూ కలిసి పోటీచేయండి. మా సత్తా ఏంటో నిరూపిస్తాం’’ అని తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. చీకటి రాజకీయాలు, ముసుగులో గుద్దులాట అక్కర్లేదన్నారు. సీమాంధ్ర అభివృద్ధి కొనసాగాలంటే తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం రావాలని తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి, ఐదుసార్లు లోక్‌సభ, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా చేసిన కిశోర్ చంద్రదేవ్ ఆదివారం సీఎం సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు వినీత గొమాంగో, సవరపు జయమణితోపాటు పలువురు నేతలు కూడా టీడీపీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా అరకు పార్లమెంటు నియోజకవర్గం నుంచి వచ్చిన గిరిజనులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. ‘‘విభజనతో రోడ్డునపడ్డా, కేంద్రం మోసం చేసినా... ఐదేళ్లు కష్టపడి ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాం. అభివృద్ధి చేస్తున్నాం. సంక్షేమంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాం. రైతులు, మహిళలు, యువత, బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, బ్రాహ్మణ, వైశ్య... ఇలా అందరికీ సంక్షేమం పథకాలు అమలు చేస్తున్నాం. మనం ఇన్ని చేస్తుండగా... ‘జగన్ సీఎం అవుతారు’ అని తెలంగాణ నేత కేటీఆర్ అంటున్నారు. నేనుంటే వీళ్ల ఆటలు సాగవు. జగన్, కేసీఆర్, మోదీలకు ఈ ప్రాంతం అభివృద్ధి కాకూడదనే ఆలోచన ఉండడం దుర్మార్గం’’ అని విమర్శించారు. శక్తి ఉంటే అభివృద్ధిలో పోటీ పడాలని హితవు పలికారు. అంతేతప్ప రాష్ట్రాన్ని వెనక్కితీసుకెళ్తామంటే సహించం అని స్పష్టం చేశారు.

Share this on your social network: