మోదీ సర్కారు తీరును తప్పుపట్టిన విపక్షాలు
Published: Thursday February 28, 2019

ఉగ్ర దాడులకు పాల్పడుతున్న పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పేందుకు సైన్యం చేస్తున్న త్యాగాలను మోదీ సర్కారు, బీజేపీ రాజకీయం చేస్తున్న తీరుపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల పట్ల రాజకీయాలకతీతంగా వ్యవహరించాలని హితవు పలికాయి. సైన్యం త్యాగాలను రాజకీయాలకు వాడుకుంటున్న తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తీర్మానాన్ని ఆమోదించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ,ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, వామపక్షనేతలు సీతారాం ఏచూరి, సురవరం సుధాకరరెడ్డి సహా దాదాపు 21 పార్టీల నేతలు బుధవారం పార్లమెంట్ లైబ్రరీ భవనంలో సమావేశమై భారత వాయుసేన పాక్‌లోని ఉగ్రస్థావరాలపై జరిపిన సాహసోపేత దాడులను ప్రశంసించాయి.
అదే సమయంలో పుల్వామాలో పాక్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్ ఆత్మాహుతి దాడి జరిపి40 మంది జవాన్లను బలిగొనడాన్ని ఖండించాయి. అమర జవాన్లకు నివాళులు అర్పించాయి.దేశ భద్రతకు సంబంధించిన అంశాల పట్ల సంకుచిత రాజకీయాలొద్దని మోదీ సర్కారుకు హితవు పలికాయి. ఒకవైపు తాము భారత సైనికులకు సంఘీభావం ప్రకటిస్తుంటే మరోవైపు ప్రధాని మాత్రం ఎన్నికల సభల్లో మాట్లాడుతూ పరిస్థితిని తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునేలా ప్రకటనలు చేయడం పట్ల మమతా బెనర్జీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
చంద్రబాబు కూడా మమత వ్యాఖ్యలను సమర్థించారు. దీంతో మిగతా ప్రతిపక్షాలు కూడా ఆమెకు మద్దతు తెలిపాయి. బూటకపు ఉన్మాద భావనలతో ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని సీతారాం ఏచూరి ఆరోపించారు. మమత వాదనకు బలం చేకూరడంతోమోదీ సర్కారు ఉగ్రదాడులను రాజకీయం చేస్తున్న తీరును ఖండిస్తూ ప్రతిపక్షాలు తీర్మానం విడుదల చేశాయి. తాజా పరిణామాలను తమకు తెలియజేయనందుకు ప్రతిపక్షా లు ఆ తీర్మానంలో ప్రభుత్వాన్ని విమర్శించాయి. జాతీ య భద్రతకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించేందుకుప్రధాని అఖిలపక్ష సమావేశం ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించాయి. అనంతరం చంద్రబాబు విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలను ప్రభుత్వం విశ్వాసంలోకి తీసుకోవాలని కోరినట్లు ఆయన చెప్పారు. ఈ భేటీలో టీజేఎస్ నేత కోదండరామ్ కూడా పాల్గొన్నారు.

Share this on your social network: