ఇరువురు రాజకీయ ఉద్దండుల భవిష్యత్తు అగమ్యగోచరం

Published: Monday March 18, 2019
 విశాఖ జిల్లాలో...ఆ మాటకొస్తే ఉత్తరాంధ్రలోనే వారిరువురూ సీనియర్‌ నాయకులు. ఒకప్పుడు టీడీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేశారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొద్ది సంవత్సరాలుగా ఖాళీగా ఉంటున్నారు. వీరిలో ఒకరు దాడి వీరభద్రరావు కాగా మరొకరు కొణతాల రామకృష్ణ. బద్ధశత్రువులుగా ముద్రపడ్డ వీరివురూ సకాలంలో నిర్ణయం తీసుకోలేకపోవడం, ఆఖరి నిమిషంలో ఒకే పార్టీలో చేరేందుకు సిద్ధపడడంతో ప్రస్తుతం అగమ్యగోచర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
 
కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేతగా వెలుగొందిన కొణతాల రామకృష్ణ తన రాజకీయ గురువైన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం ఆయన కుమారుడు జగన్‌ వెంట నడిచారు. గత ఎన్నికల అనంతరం జగన్‌తో తలెత్తిన విభేదాల నేపథ్యంలో పార్టీ నుంచి బహిష్కరింపబడ్డారు. దాంతో గత ఐదేళ్లుగా ప్రజా సమస్యలపై పనిచేస్తున్న కొణతాల అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరబోతున్నారని రూడీ చేసుకున్న తరువాత వైసీపీ నేతలు ఆయనకు ప్రత్యర్థిగా వున్న దాడి వీరభద్రరావును, ఆయన తనయుడు దాడి రత్నాకర్‌ను ఒప్పించి అనకాపల్లి ఎంపీ లేదా ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇస్తామని హామీ ఇచ్చి హడావిడిగా పార్టీలో చేర్చుకున్నారు. ఇటువంటి తరుణంలో కొణతాల అనుచరులుగా అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న పలువురు వైసీపీ నాయకులు మూడు రోజుల క్రితం కొణతాలకు నచ్చజెప్పి శనివారం హైదరాబాద్‌ తీసుకువెళ్లారు. అయితే లోటస్‌పాండ్‌లో జిల్లాకు చెందిన ఇతర పార్టీల నాయకులతో పాటు కొణతాలకు కూడా పార్టీ కండువా వేసేందుకు జగన్‌ యత్నించగా అందుకు ఆయన నిరాకరించి గతంలో తనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తే సరిపోతుందని అన్నట్టు తెలిసింది.
 
అయితే తాను కండువా వేయబోతే కొణతాల నిరాకరించడంతో ఆగ్రహించిన వైసీపీ అధినేత జగన్‌ అనకాపల్లి ఎంపీ టిక్కెట్‌ను చివరి క్షణంలో ఇంకా పార్టీలో కూడా చేరని డాక్టర్‌ కేవీ సత్యవతికి కేటాయించేశారు. అటు టీడీపీలో చేరక, ఇటు వైసీపీలో చేరే అవకాశం లేక కొణతాల రామకృష్ణ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారైంది. అదేవిధంగా దాడి రత్నాకర్‌కు అనకాపల్లి లోక్‌సభ స్థానం ఇస్తామని జగన్‌ స్పష్టమైన హామీ ఇవ్వడంతోనే దాడి వీరభద్రరావు ఐదేళ్ల విరామం తర్వాత రాజకీయ పునఃప్రవేశం చేశారు. అయితే ఆదివారం విడుదల చేసిన జాబితాలో అనకాపల్లి ఎంపీ స్థానానికి గానీ, అసెంబ్లీకి గానీ దాడి రత్నాకర్‌ పేరు కనిపించకపోవడంతో వీరభద్రరావు వర్గం షాక్‌కు గురైంది. ఈ నేపథ్యంలో అటు కొణతాల, ఇటు దాడి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారో వేచిచూడాల్సి ఉంది.