దూపం వేస్తే ‘అవంతి’ పాపం పోతుందా.?
Published: Friday March 22, 2019

భీమిలి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అవంతి శ్రీనివాసరావు ఎంపీగా అనకాపల్లిలో ప్రజలకు న్యాయం చేయకపోవడం వల్లే ఇక్కడకు పారిపోయి వచ్చాడని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఎద్దేవా చేశారు. గురువారం సాయంత్రం ఆనందపురంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వ్యాపారస్తులు ఎమ్మెల్యేలు, ఎంపీలైతే వ్యాపారాలే చూసుకుంటారని, తప్పుడుపనులు చేసేవాళ్లు భయంతో ఉంటారన్నారు. దూపం వేస్తే పాపాలు పోవన్న విషయాన్ని అవంతి గుర్తించుకోవాలన్నారు.
కాగా ఓటమి భయంతోనే మంత్రి గంటా శ్రీనివాసరావు ‘భీమిలి’ని వదిలి విశాఖ నార్త్‌కు వెళ్లారని, ఎక్కడికి వెళ్లినా వదిలేది లేదని, ఆయన రాజకీయాల నుంచి నిష్కమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. భీమిలి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో 2014 ఎన్నికల్లో గంటాకు మద్దతుగా ప్రచారం చేశానన్నారు. అయితే హామీలు నెరవేర్చకుండా గంటా పారిపోయాడని, ఇక్కడ నిలబెడితే బాగుండేదన్నారు. చిట్టివలస జ్యూట్ మిల్లులో చిన్న తప్పు జరిగిందని మూసేశారని, కార్మికులు రోడ్డున పడినా, దానిని తెరిచే యత్నం చేయకుండా భూమిని కబ్జా చేసేందుకు కొంతమంది ప్రయత్నించారని విమర్శించారు. జూట్‌మిల్లును తెరిపించేందుకు వామపక్షాలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. దివిస్ కంపెనీ నుంచి కాలుష్యం విడుదలవుతోందని, దాదాపు వంద రకాల మత్స్య జాతి అంతరించిపోయే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖలో ఎంపీగా విలువలు గల బలమైన అభ్యర్థి ఉండాలన్న ఉద్దేశంతోనే లక్ష్మీనారాయణను తీసుకువచ్చామన్నారు. వైసీపీలో పార్లమెంట్ అభ్యర్థులు భూ దందాలు చేసేవాళ్లు ఉన్నారని, అందువల్ల జేడీ లాంటి వ్యక్తిని గెలిపించాలని కోరారు. భీమిలి అభ్యర్థి పంచకర్ల సందీ్‌పను గెలిపించాలని కోరారు. మంచి పాలన, మార్పు కోసం జనసేనను గెలిపించాలన్నారు.

Share this on your social network: