హఠాత్తుగా ఉత్తరాంధ్రపై ప్రేమా?

Published: Monday April 01, 2019
శ్రీకాకుళం జిల్లాను తితలీ అతలాకుతలం చేసిన సమయంలో పక్క జిల్లాలోనే ఉన్న జగన్‌.. బాధితులను ఎందుకు పరామర్శించలేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రానివ్యక్తి ఇప్పుడు ఉత్తరాంధ్రపై ప్రేమ ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పలాస, పాతపట్నం, శ్రీకాకుళం బహిరంగ సభల్లో మాట్లాడారు. జగన్‌ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించే వాడే నాయకుడని, అవసరమైనప్పుడు ఆయన ప్రజలకు అండగా నిలబడలేదని దుయ్యబట్టారు. తితలీ తుపాను సమయంలో చీకట్లో మగ్గుతున్న బాధితుల కష్టాలను వెలుగులోకి తెచ్చింది జనసేన అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.
 
ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరిహారం ఇప్పించింది తానేనని చెప్పారు. ధర్మాన ప్రసాదరావుకు రూ.వందల కోట్ల ఆస్తులున్నా ఆయన మాజీ ఎమ్మెల్యే కోటా కింద పింఛన్‌ అందుకుంటున్నారని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధే తన లక్ష్యమన్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలోకి తమ్మినేని సీతారాంను తీసుకోవడానికి ఇష్టపడలేదని గుర్తుచేశారు. అప్పుడు, ఇప్పుడు రెండు కుటుంబాల మధ్యనే అధికారం ఉండాలని కోరుకునేవాళ్లు తనకు అవసరం లేదని చెప్పారు. అందుకే రాజకీయాలతో సంబంధంలేని వ్యక్తులను, ఆర్థిక పరిస్థితి సరిలేని వారిని గుర్తించి టికెట్‌ ఇచ్చానన్నారు. ‘నా పిల్లల భవిష్యత్‌ కోసం రాజకీయాల్లోకి రాలేదు. రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకునే జనసేన పార్టీని ఏర్పాటుచేశా’ అని చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పులివెందులకు చెందిన వ్యక్తులు వేలాది ఎకరాలు కొనుగోలు చేస్తున్నారని, వారి వద్ద కట్టుబానిసలుగా బతకకూడదంటే జనసేనకు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు.
 
ఒడిసా ముఖ్యమంత్రితో మాట్లాడి పదిరోజుల్లో ఉత్తరాంధ్ర రైతుల నీటి సమస్యలను పరిష్కరించి జలవనరులకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని చెప్పారు. శ్రీకాకుళంలో పవన్‌ మాట్లాడుతుండగా ప్రచార వాహనం నుంచి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన పవన్‌.. మరో వాహనంలోకి చేరారు. తర్వాత కొద్దిసేపటికి పొగను అదుపుచేశారు. దీనిపై పవన్‌ స్పందిస్తూ రాష్ట్రంలో ఎక్కడా ఇలా జరగలేదని.. బహుశా ఇది వైసీపీ, టీడీపీ నాయకుల పనే అని అనుమానంగా ఉందన్నారు.