జగన్ వైపు మొగ్గు చూపుతున్న సినీ ప్రముఖులు

Published: Wednesday April 03, 2019

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు  à°ªà±à°°à°®à±à°–ులు, నటులు జగన్‌కు జై కొడుతున్నారు. వారంతా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. సినీ పరిశ్రమపై టీడీపీ పట్టు కోల్పోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. రోజా, విజయ్‌చందర్‌ వంటి సీనియర్‌ నటులు మొదట్నుంచీ వైఎస్సార్‌సీపీలోనే ఉన్నారు. వీరితో పాటు పోసాని కృష్ణమురళీ తదితరులు పార్టీ తరఫున తమ గళం విన్పించేవారు.

ఇటీవల ప్రముఖ హాస్యనటుడు పృథ్వీ, మరో నటుడు కృష్ణుడు చేరారు. తర్వాత సీనియర్‌ నటి జయసుధ, మరో ప్రముఖ హాస్యనటుడు అలీ, భానుచందర్, దాసరి అరుణ్‌కుమార్, చిన్ని కృష్ణ, రాజారవీంద్ర, తనీష్‌ వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. దర్శకుడు ఎస్‌వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి తదితరులు జగన్‌కు మద్దతు పలికారు. తాజాగా ప్రముఖ నటుడు మోహన్‌బాబు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఎన్నికలు దగ్గరపడే కొద్దీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. సోమవారం రాజశేఖర్, జీవిత, హేమ, టీవీ యాంకర్‌ శ్యామల దంపతులు జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరంతా టీడీపీకి వ్యతిరేకంగా గళం విప్పడంతో పాటు, జగన్‌కు ఒక్కసారి ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వాలని తమ అభిమానులకు, ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో టీడీపీ ఆందోళన చెందుతుంది.