జనసేన పార్టీ ఆవిర్భావ మహా సభ నేడే పవన్‌ పార్టీ

Published: Wednesday March 14, 2018

 జనంలోకి జనసైన్యం వస్తోంది. జనసేన పార్టీకి దశా దిశా వెల్లడించేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సిద్ధమయ్యారు. బుధవారం గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ప్రాంతంలోని కాజా వద్ద నిర్వహిస్తున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభా వేదిక తుది మెరుగులు దిద్దుకొంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన దిశగా తెలుగు ప్రజలు కదులుతున్న తరుణంలో, జరుగుతున్న ఈ బహిరంగ సభను భారీ సక్సెస్‌ చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు నడుం బిగించాయి. ఈ సభకు భారీఎత్తున జనసమీకరణ చేపట్టాయి. దీనికోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేశాయి. సభా వేదిక ఏర్పాట్లు, సభలో ప్రస్తావనకు వచ్చే అంశాలపై మంగళవారం విజయవాడలో ముఖ్యనేతలతో పవన్‌ సమీక్ష నిర్వహించారు. అనంతరం సభా వేదికను ఆయన పరిశీలించారు. మరో పదివేల మందికి సరిపోయేలా వేదిక వద్ద ఏర్పాట్లు చేయాలని సూచించారు.