చంద్రబాబుకు భద్రత తగ్గించామనడంలో వాస్తవం లేదు
Published: Wednesday July 03, 2019

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబుకు భద్రత తగ్గించామనడంలో వాస్తవం లేదని హోంమంత్రి సుచరిత అన్నారు. ఒకవేళ అదనపు భద్రత కావాలని చంద్రబాబు అడిగితే పరిశీలించి కల్పిస్తామని ఆమె చెప్పారు. మంగళవారం సచివాలయంలో హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు జడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. ‘58 మందికి బదులు 74 మందితో భద్రత కల్పిస్తున్నాం. ఇంటివద్ద ఆర్మ్‌డ్ స్టాటిక్ గార్డ్ 2+8 కేటాయించాల్సి ఉండగా, 4+16 కేటాయించాం. 24 గంటలు అందుబాటులో ఉండేలా ఇద్దరు పీఎస్‌వోలు పనిచేయాల్సి ఉంటే.. మూడు షిఫ్టుల్లో ఆరుగురిని కేటాయించాం. రెండు ఎస్కార్ట్ గార్డులు 1+3ని మూడు షిఫ్టులుగా 24 మందిని కేటాయించాల్సి ఉండగా 24 మందిని కేటాయించాం. ఐదుగురు వాచర్స్‌ను, ఒక రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌ని, 12 మంది తనిఖీ సిబ్బందిని, బుల్లెట్ ప్రూఫ్ కారు, ఒక జామర్ వాహనాన్ని సమకూర్చాం. మూడు షిఫ్టులుగా షిఫ్టుకు ఇద్దరు డ్రైవర్ల చొప్పున ఆరుగురిని కేటాయించాం. చంద్రబాబు ప్రైవేటు ఆస్తులకు రక్షణ కల్పించడం కుదరదు.
అది మా బాధ్యత కాదు. కూల్చివేతల అంశాన్ని పక్కదారి పట్టించేలా భద్రతపై మాట్లాడుతున్నారు. ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేతలనూ తనిఖీ చేస్తారు. గుంటూరు జిల్లాలో ఆస్తి తగాదాల్లో మరణిస్తే రాజకీయ హత్య అంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా చిన్నగంజాంలో మహిళ ఆత్మహత్య చేసుకుంటే దాన్ని హత్యగా చిత్రీకరించి, వైసీపీకి ఆ పాపం అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న దాడులపై పూర్తిస్థాయి విచారణ చేపట్టడంతోపాటు వివరాలు సేకరిస్తున్నాం’ అని హోంమంత్రి సుచరిత చెప్పారు.

Share this on your social network: