సొంత ప్రభుత్వం నుంచి మమతకు ఝలక్

Published: Monday August 12, 2019
తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి సొంత ప్రభుత్వంలోని వ్యక్తులే ఊహించని ఝలక్ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ ప్రణాళికలను, రాజకీయ వ్యూహాలను తృణముల్ అమలు చేయనుంది. తృణముల్‌తో కలిసి పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ టీం తాత్కాలిక ఆఫీస్ కోసం గ్రీవెన్స్ సెల్‌లో కొంత భాగాన్ని పంచుకోవాలనుకుంది. అయితే.. గ్రీవెన్స్ సెల్‌లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం అందుకు నిరాకరించారు. ఒక ప్రైవేట్ ఏజెన్సీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు.
 
ప్రభుత్వం, ప్రైవేట్ ఏజెన్సీ మధ్య ఎంఓయూ కుదిరినప్పుడు మాత్రమే కలిసి పనిచేయాల్సి ఉంటుందని, అలాంటిదేమీ లేని పక్షంలో తమ ఆఫీస్‌కు ప్రశాంత్ కిషోర్ టీంను ఎలా అనుమతిస్తామని గ్రీవెన్స్ సెల్ అధికారులు నిలదీసిన పరిస్థితి. గ్రీవెన్స్ సెల్‌లో పనిచేసే ఉద్యోగులు కలిసి పనిచేయడం కుదరదని తేల్చి చెప్పడంతో అక్కడకు వెళ్లిన ప్రశాంత్ కిషోర్ టీంలోని ఎనిమిది మంది సభ్యులు తెల్ల ముఖం వేశారు. గ్రీవెన్స్ సెల్‌లో ఉద్యోగులు ప్రజల ఫిర్యాదులపై ఎలా పనిచేస్తారో తెలుసుకోవాలని ప్రశాంత్ కిషోర్ టీం భావించినట్లు తెలిసింది.