అక్కడ మాత్రం రాజకీయ వేడిమొదలైందని
Published: Friday August 30, 2019

ఇప్పుట్లో ఎన్నికలు లేవు.. అక్కడ మాత్రం రాజకీయ వేడిమొదలైందని చెప్పవచ్చు. రానున్న గ్రేటర్ ఎన్నికల నాటికి కేపీహెచ్‌బీ రెండుగా విభజిస్తారన్న చర్చ మొదలైంది. దీంతో జేఎన్‌టీయూ రోడ్డు నుంచి కల్వరి టెంపుల్ వరకు వసంతనగర్ పేరుతో కొత్తగా డివిజన్ ఏర్పాటవుతుందన్న చర్చతో అక్కడ రాజకీయాలు మొదలయ్యాయి. ఆ ప్రాంతం టీడీపీకి కంచుకోటగా ఉండటంతో దాన్ని ఎలాగైనా టీఆర్‌ఎస్ ఖాతాలోకి వేయాలన్న పట్టుదలతో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో ప్రస్తుత కేపీహెచ్‌బీ డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు అక్కడ పాగా వేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తెలుగుదేశం పార్టీన నాయకులు హస్తం గుర్తుకు ఓటు వేస్తారేమో కాని కారు గుర్తు ఓటేస్తారా అన్న ప్రశ్న అప్పుడే చర్చ జరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 11న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డికి ఇక్కడ వేసిన ఓట్లతోనే ఆయన పార్లమెంట్‌కు వెళ్లారనడంలో ఎటువంటి సందేహం లేదన్నది ఇప్పుడు రాజకీయ నాయకుల్లో చర్చ సాగుతోంది.
కూకట్‌పల్లి నియోజకవర్గంలో అత్యధిక సెటిలర్లు ఉన్న ప్రస్తుత కేపీహెచ్‌బీ డివిజన్‌లోని వసంతనగర్ కేంద్రంగా టీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది. 2009లో కేపీహెచ్‌బీ డివిజన్ ఒకటిగా ఉండగా.. 2016 ఎన్నికల్లో దాన్ని రెండుగా చీల్చి కొంత మేర బాలాజీనగర్‌లో కలిపారు. అప్పట్లో డివిజన్ సరిహద్దులు చేసిన నాయకులు ఆ ఎన్నికల్లో పోటీచేయడానికి వీల్లేకుండా పోయింది. ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం ప్రస్తుత కేపీహెచ్‌బీ డివిజన్‌ను రానున్న గ్రేటర్ ఎన్నికల నాటికి సరిహద్దులు చేసి కొత్తగా వసంతనగర్ పేరుతో డివిజన్ ఏర్పాటు కాబోతుందంటూ అప్పుడే చర్చలు మొదలయ్యాయి. దీంతో అక్కడ ఉన్న బలమైన తెలుగుదేశం పార్టీ కేడర్‌ను సాధ్యమైనంత వరకు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేర్చుకోవడం లేదంటే ఆ ప్రాంతంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడం ద్వారా అక్కడి ఓటర్లు టీఆర్‌ఎస్‌కు చేరువ అవుతారంటున్నారు.
2014లో అప్పట్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రస్తుత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఏడాది గడవక ముందే అభివృద్ధి కోసం.. అంటూ కారెక్కి అధికార పార్టీలోకి వెళ్లారు. దీంతో ఆ ప్రాంతంలోని కాలనీల్లోని అసోసియేషన్లు, సొసైటీలు, అపార్ట్‌మెంట్ల సంఘాలతో ఆయనకు ఇప్పటికీ పరిచయాలు ఉండటంతో వాటి ద్వారా టీఆర్‌ఎ్‌సలోకి ఆహ్వానించే ప్రయత్నాలను కార్పొరేటర్ ద్వారా నెరవేర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇటీవల జరిగిన టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా వసంతనగర్, శ్రీలాపార్క్‌ప్రైడ్, ఎన్‌ఆర్‌ఎస్ఏ కాలనీ, ఎస్‌ఎస్ కాలనీల్లోని అసోసియేషన్ల సభ్యులను భాగస్వాములను చేయడంలో మందడి శ్రీనివాసరావు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.

Share this on your social network: