మీకు మాటిస్తున్నా... అమరావతి ఇక్కడి నుంచి కదలదు..
Published: Sunday September 01, 2019

రాష్ట్ర విభజనతో అన్ని విధాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేశారన్న విషయాన్ని వైసీపీ ప్రభుత్వ పెద్దలు గుర్తుంచుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. భావితరాల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఆనాడు రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారని, కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాజధానిని మారుస్తామంటూ గందరగోళ పరిస్థితులను సృష్టించి పుట్టబోయే బిడ్డల భవిష్యత్తుతో కూడా ఆటలాడుకుంటోందని ధ్వజమెత్తారు. కౌలు కోసం ఆశపడి 26 వేల మంది పైచిలుకు రైతులు రాజధాని కోసం 34,279 ఎకరాలను ఇవ్వలేదన్నారు. రాజధాని నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం ఏమైనా తప్పులు చేసి వుంటే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలే తప్ప.. ఏకంగా రాజధానినే మారుస్తామనడం సబబు కాదన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం సాయంకాలం ఆయన రైతులతో సమావేశం నిర్వహించారు. అమరావతి రాజధాని మార్పు విషయమై వైసీపీ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రకటనలపై ఆయన రాజధానికి భూములిచ్చిన రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ చేపట్టింది ఒంటరి పోరాటం కాదని... ఇది అమరావతి రైతుల ఆత్మగౌరవ పోరాటమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతి రాజధాని ఇక్కడి నుంచి కదలదు.. అధికార పార్టీ నేతల విధ్వంస ప్రకటనలకు భయపడి రైతులెవ్వరూ తమ భూములను అమ్ముకోవద్దంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని రైతులకు భరోసానిచ్చారు.
వైసీపీకి ప్రజలు 151 అసెంబ్లీ స్థానాలను కట్టబెట్టి గొప్ప మెజార్టీని అందించారని, ఆ గౌరవాన్ని కాపాడుకుంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ఆచితూచి మాట్లాడాలని హితవు పలికారు. ప్రజల ఆస్తులను ఇష్టారాజ్యంగా దోచుకుంటే జనసేన బలంగా వ్యతిరేకిస్తుందన్నారు. ప్రజల చేత కన్నీళ్లు పెట్టించిన ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదన్నారు. ప్రభుత్వం అనేది ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలే తప్ప. స్కూల్ తరగతుల్లో క్లాస్ లీడర్ల మాదిరిగా వ్యవహరించ కూడదన్నారు. రాజధాని గ్రామాలైన ఐనవోలు, కురగల్లు, బేతపూడి, శాఖమూరు, యర్రబాలెం తదితర ప్రాంతాలలో తాను పర్యటించానని, ఆయా గ్రామాల్లో బీసీలే అత్యధికంగా వున్నారన్నారు. ఏదో ఒక కులం మీద కోపంతో ప్రజలందరినీ ఇబ్బందులు పెట్టడడం సరికాదన్నారు. రాజధాని రైతులకు తాజాగా ప్రభుత్వం కౌలు చెల్లింపులు జరపడం సంతోషమే కానీ... అసైన్డు భూములు ఇచ్చిన దళిత రైతులకు కూడా కౌలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారం ఏ ఒక్క పార్టీకి శాశ్వతం కాదని, ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికార యంత్రాంగం కూడా సక్రమంగా నడుచుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం జారీ చేసే జీవోలలో తప్పొప్పులు వుంటే సరిదిద్దుకోవాలని, లేదంటే తరువాత ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. అనంతరం రాజధాని ప్రాంత రైతులు తమ సమస్యలపై పవన్ కల్యాణ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకులు నాదెండ్ల మనోహర్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, రాజాధాని గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Share this on your social network: