తిరుపతికి చేరుకున్న మంత్రి నారా లోకేష్

తిరుపతి: కొద్ది సేపటి క్రితం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తిరుపతి చేరుకున్నారు. వీరిద్దరు తిరుపతి నుంచి తిరుమల బయల్దేరారు. కాసేపట్లో శ్రీవారిని చంద్రబాబు, లోకేష్ దర్శించుకోనున్నారు. అనంతరం నమ్మకద్రోహం- కుట్ర రాజకీయాలపై టీడీపీ ధర్మపోరాట బహిరంగసభ సీఎం పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర నిర్లక్ష్య వైఖరిని చంద్రబాబు ఈ సభలో ఎండగట్టనున్నారు. సభలో ప్రధాని మోదీ ప్రసంగాల వీడియోలను చంద్రబాబు ప్రదర్శించనున్నారు.
తిరుమల వెంకన్న సాక్షిగా హోదా ఇస్తామని వంచన చేసిన నరేంద్ర మోదీ, బీజేపీలపై సమరాన్ని టీడీపీ మరింత ఉధృతం చేసింది. ఇందులో భాగంగా తిరుపతిలో సోమవారం భారీస్థాయిలో ధర్మపోరాట సభ నిర్వహిస్తోంది. 2014 ఏప్రిల్ 30వ తేదీన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని తారకరామా స్టేడియంలో మోదీ ప్రత్యేక హోదా ఇస్తామని, రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వాటిని నెరవేర్చకుండా మోసగించారని మండిపడుతున్న తెలుగుదేశం పార్టీ.. అదే ఏప్రిల్ 30న అదే ప్రాంగణం నుంచి మోదీ మోసాన్ని జనానికి తెలియజెప్పే విధంగా సభ నిర్వహిస్తోంది. తిరుపతి సభతో శ్రీకారం చుట్టి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఈ సభలు నిర్వహించనున్నారు.

Share this on your social network: