నాణ్యమైన బియ్యం సరఫరాకు ఇదే మార్గం

Published: Thursday September 19, 2019
తెల్లకార్డుదారులకు నాణ్యమైన బియ్యం పంపిణీకి వీలుగా ధాన్యం సేకరణ బాధ్యతను పౌర సరఫరాల శాఖ తీసుకోవడమే ఉత్తమమనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. నాణ్యమైన ధాన్యాన్ని సేకరించి, బియ్యం ఆడించేందుకు మిల్లర్లకు ఆర్డర్లివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెల్ల రేషన్‌ కార్డుదారులకు నాణ్యమైన బియ్యం సరఫరా విషయమై ప్రభుత్వం నియమిం చిన మంత్రివర్గ ఉప సంఘం బుధవారం సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. వీటిని గురువారం సీఎం జగన్‌ వద్ద జరిగే సమావేశంలో చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలు ఈవిధంగా ఉన్నాయి.

నాణ్యమైన బియ్యం ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా మేలురకం ధాన్యం సేకరించి.. బియ్యం ఆడేందుకు మిల్లర్లకు అప్పగించాలి.బియ్యం ఆడేందుకు కిలోకు రూ.రెండు దాకా మిల్లర్లు ఆశిస్తున్నారు. వారికి రూపాయి నుంచి 1.30 ఇచ్చినా సరిపోతుంది. దీనికి ఏటా 450-500 కోట్లు అవుతుంది. 5, 10, 15 కిలోల సంచు లకు రూ.250 కోట్లు అవుతాయి.

ధాన్యం సేకరణను కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టాలి. దీనివల్ల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి సలహాలూ సూచనలు ఇవ్వొచ్చు.

ఇది విజయవంతమైతే రాష్ట్రమంతటికీ విస్తరించాలి.