ట్రంప్ ట్విటర్ ఖాతా తొలగించారు

అమెరికా: ఓ ట్విటర్ ఉద్యోగి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను డీయాక్టివేట్ చేసేశాడు. ఈ విషయాన్ని ట్విటర్ గురువారం వెల్లడించింది. ఆ ఉద్యోగి వివరాలు కంపెనీ వెల్లడించలేదు కానీ.. అతనికి ఉద్యోగంలో అదే ఆఖరి రోజని వెళ్లిపోయేముందు ట్రంప్ ఖాతాను 11 నిమిషాల పాటు తొలగించినట్లు పేర్కొంది. అయితే అతను కావాలని అలా చేయలేదని పొరపాటుగా జరిగిందని తెలిపింది.
గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ట్విటర్‌లో ట్రంప్ పేరు టైప్ చేసి చూస్తే పేజ్ లేనట్లు చూపించిందట. దాంతో ట్రంపే తన ఖాతాను తొలగించి ఉంటారని ఆయన ఫాలోవర్లు విరివిగా ట్వీట్లు గుప్పించారు. దాంతో ట్విటర్ అప్రమత్తమై వెంటనే స్పందించింది. పొరపాటున తమ ఉద్యోగే ట్రంప్ ట్విటర్ డీయాక్టివేట్ చేసినట్లు వెల్లడించింది. ఆ తర్వాత కొద్ది సెకన్లలోనే మళ్లీ యాక్టివేట్ చేశారు. మున్ముందు ఇలాంటివి జరగకుండా చూస్తామని ట్విటర్ పేర్కొంది.
గతంలో ట్రంప్ ఉత్తర కొరియాపై బెదిరింపులకు పాల్పడుతుండడంతో అతని ట్విటర్ ఖాతాను తొలగించాల్సిందిగా ఎందరో నెటిజన్లు ట్విటర్‌ను కోరారు. కానీ ట్రంప్ చేస్తున్న ట్వీట్లలో విషయం ఉంటుందని ఇలాంటి చిన్న విషయాలకు ఆయన ట్విటర్ ఖాతాను తొలగించలేమని వెల్లడించింది. ట్రంప్ 2012లో ట్విటర్ ఖాతాను తెరిచారు. ఇప్పటికే ఆయన ఫాలొవర్ల సంఖ్య 40 మిలియన్లు దాటింది.

Share this on your social network: