పెయిడ్‌ ఆర్టిస్టులు పోయి టీడీపీ ఆర్టిస్టులు

Published: Friday October 11, 2019
మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పెట్టిన పథకాలకు టీడీపీ అధినేత చంద్రబాబు పేర్లు మార్చుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. తన ఎమ్మెల్యేలు తప్పు చేస్తే సీఎం జగన్‌ చర్యలు తీసుకున్నారని, చంద్రబాబు హయాంలో ఎంతమంది టీడీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కాల్‌ మనీ వ్యవహారంలో ఎంతమందిపై కేసులు పెట్టారని నిలదీశారు. చంద్రబాబు తన సమావేశంలో కరెంట్‌ ఆపుకుని..కరెంట్‌ పోయిందని చీప్‌ ట్రిక్‌లు చేస్తున్నారని ఆరోపించారు. పెయిడ్‌ ఆర్టిస్టులు పోయి టీడీపీ ఆర్టిస్టులు వచ్చారని బొత్స సత్యనారాయణ ఎద్దేవాచేశారు.
 
‘‘చంద్రబాబు అతలాకుతలం చేసిన ఆర్థిక వ్యవస్థను జగన్‌ గాడిలో పెడుతున్నారు. విశాఖలో టీడీపీ నేతలే భూకుంభకోణాలకు పాల్పడ్డారు. భూ రికార్డులు తారుమారు చేసింది చంద్రబాబు, లోకేష్‌ కాదా? టీడీపీ హయాంలో బూత్‌రూమ్‌లకు కూడా పసుపు రంగువేశారు. చివరికి శాపాలు పెట్టే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం కంటే టీడీపీ నేతలు దోచుకున్నదాని వల్లే ఎక్కువ నష్టం వచ్చింది. చంద్రబాబుకు కే ట్యాక్స్‌, ఎల్లో ట్యాక్స్‌ వసూలు చేయడం అలవాటు’’ అని బొత్స దుయ్యబట్టారు.