దీక్ష చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాతే

Published: Tuesday November 12, 2019
 ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. ఎల్లుండి అనగా నవంబర్-14న విజయవాడలో 12గంటలపాటు బాబు దీక్షకు దిగుతున్నారు. కాగా ఈ దీక్ష విషయమై చంద్రబాబు తాజాగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ దీక్ష ప్రకటన చేశాక ఇసుక అందుబాటు స్వల్పంగా పెంచారని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. 14నుంచి ఇసుక వారోత్సవాల ప్రకటన అందులో భాగమేనన్నారు. ఇసుక కొరత అనేది గతంలో ఏపీ చరిత్రలోనే లేదని.. ఆహార కొరత, విద్యుత్ కొరత, గ్యాస్ కొరత, నీటి కొరత విన్నాం కానీ, ఇసుక కొరత ఇప్పుడే చూస్తున్నామన్నారు. లేని ఇసుక కొరత సమస్యను వైసీపీ నేతలే సృష్టించారని బాబు విమర్శలు గుప్పించారు. నేతల అక్రమార్జనలకు ఇసుకను ఆదాయ వనరుగా చేశారన్నారు. మంగళవారం నాడు కృష్ణా, గుంటూరు జిల్లాల టీడీపీ నేతలతో బాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
 
 
 ఎరువులు, పురుగు మందుల బ్లాక్ మార్కెటింగ్ గురించి గతంలో విన్నాం. ఇసుక బ్లాక్ మార్కెటింగ్ గురించి ఇప్పుడే చూస్తున్నాం. 5రెట్ల అధిక ధరలకు ఇసుక విక్రయాలు చేస్తున్నారు. తీయాల్సిన దానికన్నా 5రెట్లు తక్కువ తీస్తున్నారు. కృత్రిమ కొరతను, బ్లాక్‌లో విక్రయాలను ప్రోత్సహించారు. వైసీపీ నేతలే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌కు ఇసుక అక్రమ రవాణా. లారీ ఇసుక రూ.80వేల నుంచి రూ.లక్షకు అమ్మడం చరిత్రలో ఉందా...?. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ రాజీలేని పోరాటం. భవన నిర్మాణ కార్మికులకు అండగా టీడీపీ ఉంటుంది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ పోరాట కమిటీ ఏర్పాటు చేశాం’ అని చంద్రబాబు ఈ సందర్భంగా కాన్ఫరెన్స్‌లో తెలిపారు.