వైసీపీలోకి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాశ్‌

Published: Friday November 15, 2019
తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాశ్‌ తన పదవికి, టీడీపీ సభ్యతానికి రాజీనామా చేశారు. ఆయనతోపాటు టీడీపీ సీనియర్‌ నేత కడియాల బుచ్చిబాబు కూడా రాజీనామా సమర్పించారు. వీరిద్దరూ తమ రాజీనామా లేఖలను గురువారం ఉదయం టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్‌.. దేవినేని అవినాశ్‌, కడియాల బుచ్చిబాబులకు వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవినాశ్‌ మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నచ్చి వైసీపీలో చేరానన్నారు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబుకు అవినాశ్‌ సుదీర్ఘమైన లేఖ రాశారు. తాను పార్టీని వీడుతున్నాయంటూ ప్రధాన మీడియాలోనూ, సోషల్‌ మీడియాలోనూ వార్తలు హల్‌చల్‌ చేయడం వెనుక స్థానిక నేతలు ఉన్నారని ఆరోపించారు.
వారిపై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ లేకపోగా, వారికే ప్రాధాన్యం లభించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ తనను, తమ అనుచరగణాన్ని ఉపయోగించుకోవడంలో విఫలమైందని స్పష్టం చేశారు. అనువుకాదని తెలిసినా గుడివాడలో అధినేత మాటను జవదాటకుండా పోటీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దేవినేని అవినాశ్‌ వైసీపీ తీర్థం పుచ్చుకోవడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఆదినుంచి పార్టీకి సంస్థాగతంగా పట్టు ఉన్న గుడివాడ నియోజకవర్గానికి అవినాశ్‌ అతిఽథిగా వచ్చి వెళ్లిపోయాడనీ, ఆయన పార్టీని వీడినా వచ్చిన నష్టమేమీ లేదని స్పష్టం చేస్తున్నారు.