టీడీపీ నేతలను పిచ్చాస్పత్రిలో చేర్పిస్తేనే..!

Published: Tuesday December 10, 2019
ఏపీ అసెంబ్లీలో రెండోరోజు ‘సన్నబియ్యం’పై పెద్ద చర్చే జరిగింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో సన్న బియ్యం అనే పేరే లేదన్నారు. ఫస్ట్ బియ్యం గురించి తెలుసుకుని నాలెడ్జ్ పెంచుకోండని విపక్ష పార్టీకి చెందిన సభ్యులకు ఆయన సూచించారు. ఈ సందర్భంగా మేనిఫెస్టోను అసెంబ్లీలో జగన్ చూపించారు. మేనిఫెస్టో భగవద్గీత అని చెప్పి రిలీజ్ చేశామని సీఎం తెలిపారు. ప్రతి అంశాన్ని అమలు చేస్తామని చెప్పామన్నారు.
 
నాణ్యమైన బియ్యం, సన్న బియ్యం తేడా తెలియకుండా సాక్షి పేపర్‌లో తప్పుగా రాశారని అసెంబ్లీలో సీఎం చెప్పుకొచ్చారు. సన్న బియ్యం అన్న పేరే లేదన్నారు. స్వర్ణ రకాన్నే సన్న బియ్యం అంటారని ఆయన తెలిపారు. రేషన్‌ బియ్యాన్ని ప్రజలు తీసుకోవడం లేదని నాణ్యమైన బియ్యం ఇస్తున్నామన్నారు. మేం ఇచ్చే బియ్యంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. నాణ్యమైన బియ్యం కోసం రూ.1400 కోట్లు అదనంగా ఖర్చు చేస్తాం. ఏప్రిల్‌ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన బియ్యం ఇస్తాం. స్వర్ణ లాంటి రకాల ధాన్యాన్ని మాత్రమే సేకరిస్తాం. నాణ్యమైన బియ్యం ఇస్తుంటే ఈర్షతో టీడీపీ విమర్శలు చేస్తోంది. టీడీపీ నేతలను పిచ్చాస్పత్రిలో చేర్పిస్తేనే బాగుపడతారు అని అసెంబ్లీలో వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.