పాలన లోపం వల్ల అన్నిహత్యలేనని జగన్ తీవ్ర స్థాయిలో మండిపాటు

పశ్చిమ గోదావరి: గోదావరి నదిలో లాంచీ ప్రమాదంపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పడవలు, లాంచీల ప్రయాణాలకు భద్రత కరువైందని వైసిపి అధినేత జగన్ ధ్వజమెత్తారు. జగన్ పాదయాత్ర బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా రామారావు గూడెం చేరుకున్న సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ పడవ ప్రమాదాలపై ఎపి ప్రభుత్వం తీరును ఎండగట్టారు.
గడచిన ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఇది మూడో పడవ ప్రమాదమని, లైసెన్స్ లేని బోట్లు ఎలా తిరుగుతున్నాయని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై హత్యా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పాలన లోపం వల్ల జరిగిన ఈ ఘటనలు అన్ని ప్రభుత్వం చేసిన హత్యలేనని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గోదావరి, కృష్ణా నదులపై జరుగుతోన్న
పడవ,లాంచీల ప్రమాదాలు సర్కారు హత్యలేనని, ఈ దుస్సంఘటనలకు ముఖ్యమంత్రి, మంత్రులు బాధ్యత వహించాలని అన్నారు.
కేవలం ఆరు నెలల్లో మూడు దుస్సంఘటనలు చోటు చేసుకోవడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. నదులపై భద్రత లేని పడవలు, లాంచీలు యథేచ్చగా తిరుగుతున్నాయని...
వాటిలో ఏ ఒక్కదానికీ ఫిట్‌నెస్ లేదన్నారు. ఇక్కడ చేతులు మారుతున్నలంచాలలో నారా లోకేశ్, ఇతర మంత్రులకు వాటాలపై చంద్రబాబుపై విచారణ జరపాలని జగన్ డిమాండ్ చేశారు.
"ముఖ్యమంత్రి అధికార నివాసానికి సమీపంలో గత నవంబరులో కృష్ణా నదిలో పడవ ప్రమాదం జరిగింది.
ఈఘటనలో 21 మంది మరణించారు. అయిదు రోజుల కింద మరో పడవ గోదావరి నదిపై వెళుతోన్నపడవ అగ్ని ప్రమాదానికి గురైంది. అందులోని 40 మంది ప్రయాణీకులు ఆ పడవ నుంచి ...
బయట పడి ప్రాణాలు దక్కించుకున్నారు. లేని పక్షంలో చనిపోయి ఉండేవాళ్లు...నిన్న లాంచీ గోదావరి నదిలో మునిగి పోయిన ఘటనలో...అమాయకులైన గిరిజన ప్రయాణీకులు మృతి చెందారు...పుష్కరాల సమయంలో కూడా చంద్రబాబు నిర్వాకం వల్ల...29 మంది భక్తులు తొక్కిసలాటలో కన్ను మూశారు.
" అని జగన్ చెప్పారు.
గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు సినిమా షూటింగ్ కోసం చేసిన పని వల్లే ఆ దారుణం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ తొక్కిసలాటపై విచారణ ఏమైందో తెలియడం లేదని చెప్పారు. ఈ ఘటన విచారణ జరిగితే చంద్రబాబుది తప్పు అని తేలుతుందని అన్నారు. అందుకే విచారణ నివేదిక బయటకు రావడం లేదని చెప్పారు. వైఎస్సార్ సీపీ సీనియర్ నేతలు, వైఎస్సార్ సీపీ శ్రేణులు లాంచీ ప్రమాదం జరిగిన చోట సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు వైఎస్ జగన్ వెల్లడించారు. ఈ ఘటనలపై ప్రభుత్వం నామ మాత్రంగా విచారణకు ఆదేశిస్తోంది.విచారణ నివేదికలపై ఎలాంటి చర్యలు లేవు. వాస్తవానికి విచారణలను ఎవరిపై వేయాలి? ముఖ్యమంత్రి. ఆయన కుమారుడు, మంత్రులపై విచారణలు జరగాలి...ఈఘటనలకు బాధ్యులు వారే...ముందు వారిపై విచారణలు వేసి చర్యలు తీసుకోవాలిఅని జగన్ చెప్పారు.
నిన్నటి పడవ ప్రమాదం ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు తక్షణం నష్టపరిహారం ఇవ్వాలని...ఒక్కో కుటుంబానికి రూ 25 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అయినా రాష్ట్రంలో వంద బోట్లను నియంత్రించడం సర్కారుకు సాధ్యం కాదా?...ఇదేమి పరిపాలన అని జగన్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నుంచి టీడీపీ నేతల వరకూ లంచాలు తీసుకోవడం వల్లే ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.

Share this on your social network: