మేం చెప్పేవన్నీ అబద్ధాలేనంటారా?
Published: Friday January 17, 2020

రాజధాని రైతుల ఆందోళనల విషయంలో హైపవర్ కమిటీ సిద్ధం చేసిన నివేదికను సీఎం జగన్మోహన్ రెడ్డికి అందజేసినట్లు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వచ్చే కేబినెట్ భేటీలో ఈ నివేదికపై చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతిలో రైతుల ఆందోళనను సీఎం దృష్టికి తీసుకెళ్లామని, వారికి న్యాయం జరిగేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు చెప్పారు. సీఆర్డీఏ చట్టం రద్దు విషయం తమ దృష్టిలో లేదన్నారు. హైపవర్ కమిటీ ఈమెయిల్‌ను ఎవరో హ్యాక్ చేశారని బొత్స ఆరోపించారు. కొందరు రాజధాని ప్రాంత రైతులు తమను కలిసి సమస్యలు వివరించినట్లు ఆయన తెలియజేశారు.
అమరావతి రాజధానికి అనుకూలం కాదని చెన్నై ఐఐటీ నివేదిక ఇవ్వలేదంటోంది కదా అనే ప్రశ్నకు బొత్స నేరుగా సమాధానం చెప్పలేదు. ‘కావాలంటే మీరు కూడా చెన్నై ఐఐటీకి మెయిల్ పెట్టుకోండి. మేం చెప్పేవన్నీ అబద్ధాలే అంటారా? శివరామకృష్ణన్ కమిటీ నివేదిక కూడా అబద్ధమేనా?’ అంటూ మీడియా ప్రతినిధులను ఆయన ఎదురు ప్రశ్నించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలపై తానేం మాట్లాడగలను? అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ భవనం గురించి అడగ్గా.. ఈ అసెంబ్లీ పర్మినెంట్ అని చంద్రబాబు ఎప్పుడైనా అన్నారా? అని ఎదురు ప్రశ్నించారు. చంద్రబాబే తాత్కాలిక భవనం అన్నప్పుడు, దాన్ని తామెలా శాశ్వత భవనం అంటామని అడిగారు. చంద్రబాబుకు తన సామాజికవర్గం పట్ల తప్ప, సమాజం పట్ల అంకిత భావం లేదని విమర్శించారు.

Share this on your social network: