టచ్ చేస్తే ఏపీలో తిరుగుబాటు ఖాయం

Published: Saturday June 13, 2020

టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకరర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని టచ్ చేస్తే ఏపీలో తిరుగుబాటు ఖాయం అని వ్యాఖ్యానించారు. అదే జరిగితే ఏపీ ప్రజలు సహించరన్నారు. తన తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి అరెస్టులపై స్పందించిన ఆయన.. ఇదంతా కక్ష సాధింపు చర్యలేనన్నారు. రాష్ట్రంలో పాలన నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్టు సాగుతోందన్నారు. తానైతే పార్టీని వీడేది లేదని, ఆ పార్టీలో చేరేది లేదన్నారు. తాను ఎప్పుడు అరెస్ట్ అవుతానో తనకు తెలియదని.. అయినా దేనికైనా రెడీ అన్నారు. జగన్మోహన్ రెడ్డికి అల్లాపై, శ్రీశైలం మల్లన్నపై నమ్మకం లేదని, తిరుపతి వెంకన్నపై అసలే లేదని, యేసును కూడా నమ్మడని.. అహం ఎక్కువ అన్నారు. దేవుడి కంటే కూడా నరేంద్రమోదీకి ఎక్కువగా భయపడతాడని ఎద్దేవా చేశారు. ఏరికోరి తీసుకున్న ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల మాటలే వినడం లేదని, వారి నడుం విరగగొట్టేశారన్నారు. ఏ కాగితంపై సంతకం పెట్టమంటే చీఫ్ సెక్రటరీలు కూడా అక్కడ సంతకాలు పెడుతున్నారన్నారు. రాయలసీమలో ఓ పద్ధతి ఉందని, ప్రత్యర్థుల  ఆర్థికపరిస్థితిని దెబ్బ కొట్టి.. వాళ్లు రోడ్డున పడితే ఈగో చల్లారుతుందని వ్యాఖ్యానించారు. తుగ్లక్ పాలనలో కూడా ఇలాంటి పద్ధతి లేదని, ఈ దేశంలో ఇలాంటి ముఖ్యమంత్రి గతంలోనూ లేడు... రాబోయే రోజుల్లో కూడా రాబోడన్నారు. తమ కంపెనీలో 30-40 ఏళ్లుగా పని చేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు ఉన్నారని, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జీతాలు ఇస్తున్నామన్నారు.